హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): నరేంద్ర మోదీ గుజరాత్‌కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. ఆర్నెళ్లలో ఒక్క గుజరాత్ రాష్ర్టానికే రూ.80 వేల కోట్లు కేటాయించడమేంటని ప్రశ్నించారు. దేశ సంపదను ఒక్క రాష్ర్టానికే ఎలా తరలిస్తారని నిలదీశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మోదీ నిర్ణయాలు కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తికి తూట్లు పొడిచేలా ఉన్నాయని దుయ్యబట్టారు. దేశం అంటే ఒక్క గుజరాత్ మాత్రమే అన్నట్టు వ్యవహరిస్తున్న మోదీ తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, అందుకే ఇప్పటి నుంచే అక్కడికి నిధులన్నీ తరలిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీయేతర రాష్ర్టాలపై అక్కసు
బీజేపీ పాలిత రాష్ర్టాలకు అధిక నిధులు కేటాయిస్తూ, విపక్ష పాలిత రాష్ర్టాలపై అడుగడుగునా అక్కసు వెళ్లగక్కుతున్నారని మోదీ తీరుపై వినోద్ ధ్వజమెత్తారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా తెలంగాణ అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని స్పష్టంచేశారు.
ఫర్ గుజరాత్, టు గుజరాత్
ఫర్ గుజరాత్, టు గుజరాత్ బై ది పీఎం ఆఫ్ గుజరాత్ అంటూ ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఇది డెమోక్రసీనా లేదా మోడీక్రసీనా లేదా ప్లెయిన్ హిపోక్రసీనా అంటూ ప్రశ్నించారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక గుజరాత్‌కు రూ.80 వేల కోట్లు విలువైన వివిధ ప్రాజెక్టులను కేటాయించారంటూ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు.