కేసముద్రం, ఫిబ్రవరి 6 : సెల్ఫోన్ వినియోగం ఆ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన కోగిల అరవింద్ ఖమ్మంలో బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం ఇంటికి వెళ్లేందుకు విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే శాతవాహన ఎక్స్ప్రెస్ను ఖమ్మంలో ఎక్కాడు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నే స్టేషన్ల మధ్య రైలు డోర్ వద్ద నిలబడి ఫోన్ మాట్లాడుతుండగా కిందపడిపోయింది. ఫోన్ కోసం వెంటనే అరవింద్ రైలు నుంచి కిందకు దూకగా.. రెండు కాళ్లు విరగ్గా, చేతికి గాయాలయ్యాయి. వరంగల్ దవాఖానకు తీసుకెళ్లినట్టు హెచ్సీ భాస్కర్ తెలిపారు.