Telangana | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఏదైనా కోర్సులో చేరితే ఎప్పుడైపోతుందా?ఎప్పుడు పట్టా చేతికొస్తుందా? అని చూస్తుంటాం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ఆయులూరి శ్రీనివాసరెడ్డి(41) ఇందుకు భిన్నం. ఇప్పటికే 7 డిగ్రీలు సొంతం చేసుకున్న ఆయన తాజాగా ఎనిమిదో డిగ్రీ కోసం ఆసక్తి చూపుతున్నాడు. బీఎస్సీ, డబుల్ ఎమ్మెస్సీ, సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, డబుల్ ఎంటెక్ పూర్తిచేయటమే కాకుండా… మధ్యలో ఎల్ఎల్బీ చదివాడు. ఇప్పుడు ఇంజినీరింగ్‌లో చేరేందుకు సిద్ధపడ్డాడు.
బీటెక్‌లో ల్యాటరల్ ఎంట్రీ కోసం టీఎస్ ఈసెట్ ఎంట్రెన్స్‌కు హాజరయ్యి బీఎస్సీ గణితం విభాగంలో 82 మార్కులతో ఏకంగా రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్‌ను సాధించాడు. తనకు కోడింగ్, ప్రోగ్రామింగ్ అంటే అమితాసక్తి అని, అందుకే బీటెక్ సీఎస్ఈ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ కోర్సులో చేరుతానని శ్రీనివాస్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.