హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, డ్రోన్స్, బ్లాక్ చైన్ వంటి నూతన సాంకేతిక రంగాలకు చెందిన కోర్సులపై అవగాహన పెంచుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రపంచం ఇప్పుడు అనేక అవకాశాలతో నిండి ఉన్నదని, గ్లోబల్ మార్కెట్‌కి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. జేఎన్టీయూలో శనివారం ఎప్‌సెట్-2025పై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
కంప్యూటర్ సైన్స్(సీఎస్ఈ) కోర్సుల్లో అధిక ప్రవేశాలు జరుగుతున్నాయని, కాని తక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటూ.. విద్యార్థులు కోర్ ఇంజినీరింగ్ గ్రూపుల వైపు దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు ఉద్యోగ సృష్టికర్తలుగా తయారు కావాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు హాజరయ్యారు. కరీంనగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి వంటి పలు జిల్లాలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు.