ఏ సాగునీటి ప్రాజెక్టు అయినా నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు చేపట్టాల్సి ఉంటుంది. కాలువల సామర్థ్యం, పంపుహౌస్‌ల ఏర్పాటు అందుకు అనుగుణంగానే ఉండాలి. కానీ కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పనులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. నీటి మళ్లింపు సామర్థ్యం గోరంత ఉంటే, నీటి తరలింపు, అవసరాలు మాత్రం కొండంత అన్న చందంగా మారింది. నీటి మళ్లింపు, కాలువల సామర్థ్యం పెంచకుండానే కొడంగల్ లిఫ్ట్ పనులు హడావుడిగా చేపడుతుండటంపై ‘కోట్లు కొల్లగొట్టే’ మతలబు ఉన్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రణాళికలు లేకుండా హడావుడిగా పనులు చేపడితే ప్రాజెక్టు ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని సాగునీటి రంగ నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ఆగమేఘాలపై బడ్జెట్లో నిధులు కేటాయించి హడావుడిగా పనులు చేపట్టడం వెనుక వేరే మతలబు ఉన్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యనేత సన్నిహితుడైన మంత్రికి చెందిన నిర్మాణ సంస్థ ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నది. ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకునే బాధ్యత మరో మంత్రికి అప్పగించారు. ప్రాజెక్టు పేరిట భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్టు ఎలాంటి ప్రణాళికలు లేకుండా చేపడుతున్న పనులే తేల్చిచెప్తున్నా యి. రూ.2,495 కోట్లలో 7 టీఎంసీల నీటిని ఎత్తిపోసి కొడంగల్‌కు నీళ్లు తరలించాలని, లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇంజినీరింగ్ అంతా మాయాజాలంగా మారింది.
జూరాల రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి కాలువల స్థాయి పెంచకుండా రిజర్వాయర్లను పటిష్టం చేయకుండా వరద జలాలను తోడి తీసుకెళ్లేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కాగితాల్లో వేసిన లెక్కలు.. వాస్తవ పరిస్థితులు అం దుకు భిన్నంగా ఉన్నాయి. రైతులకు కూడా పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకుండానే పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఓ మంత్రి అండదండలతో బలవంతంగా పనులు చేపడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా పంప్‌హౌస్ వద్ద బ్లాస్టింగ్లు, పొలాలను తవ్వి పైప్లైన్లు వేయడం, మాగనూరు వాగు నుంచి పర్మిషన్ లేకుండా ఇసుక అక్రమ రవాణా, ప నులు జరుగుతున్న స్థలంలో ఎక్కడా నిర్మాణ సంస్థ పేరు లేకపోవడం గమనార్హం. అక్కడికి ఎవరు వెళ్లినా ‘ఇది పొంగులేటి కంపెనీ.. ఏమన్నా ఉంటే లోకల్ మంత్రితో మాట్లాడుకోండి’ అని పంపిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌కు నీటిని తరలించేందుకు నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను రూ.2,945.50 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో చేపట్టారు. ప్రధానం గా జూరాల నుంచి నేరుగా కాకుండా, భీమా ప్రాజెక్టులో భాగమైన భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతలు ప్రతిపాదించారు. తొలుత భూత్పూర్ రిజర్వాయర్ నుంచి జలాలను 2.750 కి.మీ అప్రోచ్ కెనాల్ ద్వారా కాట్రేవుపల్లి పంప్‌హౌస్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి రెండు 30 మెగావాట్ల పంపుల ద్వారా 1,695 క్యూసెక్కుల నీటిని ఎత్తి 16.750 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ పైప్‌లైన్ ద్వారా ఉట్కూరు పెద్ద చెరువుకు తరలిస్తారు. అక్కడి నుంచి 2.15 కిలోమీటర్లు కాలువ పంప్‌హౌస్-2కు తరలిస్తారు.
ఇక్కడి నుంచి 35 మెగావాట్ల పంపుల ద్వారా జలాలను ఎత్తి 12 కి.మీ ప్రెషర్ మెయిన్ పైప్‌లైన్ ద్వారా జలాలను పేరపళ్ల మండలం జాయమ్మ చెరువులోకి తరలిస్తారు. ఇక్కడి నుంచి అప్రోచ్ చానల్ ద్వారా 3వ పంప్‌హౌస్‌కు జలాలను తరలిస్తారు. ఇక్కడ 30 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు పంపుల ద్వారా 1,236 క్యూసెక్కుల నీటిని ఎత్తి 9 కి.మీ ప్రెషర్ మెయిన్ పైప్‌లైన్ ద్వారా కానుకుర్తి చెరువుకు జలాలు తరలిస్తారు. ఆ తర్వాత గ్రావిటీ ద్వారా దౌల్తాబాద్, బొమ్రాస్పేట చెరువులకు నీటిని తరలిస్తారు.
గ్రావిటీ కెనాల్ ద్వారా మధ్యలో లక్ష్మీపూర్, ఈర్లపల్లి, హుస్నాబాద్, కొడంగల్ చెరువులు నింపాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రాజెక్టు ద్వారా సుమారు లక్ష ఎకరాలను తొలుత ప్రతిపాదించారు. ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గానికి అదనంగా కూడా జలాలు అందించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 0.385 టీఎంసీని తాగునీటి కోసం ఉపయోగించాలని ప్రతిపాదించారు. ఒక్కో పంప్‌హౌస్ కోసం రూ.1,438 కోట్లు కాగా రెండు పంప్‌హౌస్‌లకు రూ.2,876 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ప్రస్తుతం చేపడుతున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉత్తుత్తి పథకంగా మారనున్నదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటు ప్రజలు, అటు రైతులకు కాకుండా కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చేదిగా ఈ ప్రాజెక్టు ఉన్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణానది నుంచి నీటి లభ్యతను పెంచకుండా ఈ పథకానికి నీరు ఎలా తరలిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రస్తుతం భీమా ఫేస్-1లో 1500 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు ఉద్దేశించింది. ఈ మేరకే పంప్‌హౌస్‌లు, కాలువల నిర్మాణం చేపట్టారు.
ఫేస్-1లో రెండు రిజర్వాయర్లు ఉన్నాయి. సంగంబండ రిజర్వాయర్ కెపాసిటీ 3 టీఎంసీలు కాగా భూత్పూర్ రిజర్వాయర్ కెపాసిటీ 1.2 టీఎంసీలు మాత్రమే. కాల్వ నుంచి గొలుసు కట్టు చెరువులకు నీటిని వదిలేందుకు డిజైన్ చేశారు. 1500 క్యూసెక్కుల నీటి లభ్యత ఉన్న భీమా ఫేజ్-1 ద్వారా 3000 టీఎంసీలకు పెంచి ఆ మేరకు నీటిని తరలిస్తామని ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చిన్న గోప్లాపూర్ వద్ద ఉన్న పంప్‌హౌస్‌లో 650 సెక్కులకు సంబంధించి రెండు పంపులున్నాయి.
కెపాసిటీ 650 క్యూసెక్కులున్నా..450 క్యూసెక్కులను మాత్రమే రన్ చేస్తారు. అక్కడి నుంచి ఇటు సంగంబండకు, అటు భూత్పూరుకు ఉన్న కాలువలో కేవలం 900 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కాల్వలు మాత్రమే నిర్మించారు. పూర్తిస్థాయిలో 1300 క్యూసెక్కుల నీటిని తరలిస్తే కాల్వలపై నుంచి నీళ్లు ఓవర్ ఫ్లో అయ్యే అవకాశం ఉన్నది. ఇక రుద్రసముద్రం, భూత్పూర్ గ్రామాల సమీపంలో కాలువను మళ్లిస్తున్నారు. మెయిన్ కెనాల్‌కు నీళ్లు వదులుతున్న సమయంలో భూత్పూర్ రిజర్వాయర్ కాలువ తూములు తెరువనున్నారు.

చిన్న గోప్లాపూర్ పంప్‌హౌస్ ద్వారా సం గంబండ రిజర్వాయర్‌కు పెద్ద కాలువ నుంచి నీటిని తరలిస్తున్నారు. అయితే భూత్పూర్ సమీపంలో ఆ రిజర్వాయర్‌కు మరో కాలువ ద్వారా మళ్లిస్తున్నారు. ప్రధాన కాల్వలో రోజుకు 900 నుంచి 1200 క్యూసెక్కుల నీటిని తరలిస్తే ఇక్కడ మళ్లించే కాలువకు నాలుగో వంతు నీళ్లు మాత్రమే వెళ్తాయి. భూత్పూర్ రిజర్వాయర్ కెపాసిటీ 1.2 టీఎంసీలు కాగా పూర్తి స్థాయిలో నిండడానికి 35 రోజుల నుంచి 45 రోజుల సమయం పడుతుంది. కృష్ణా నదికి వరదలు వచ్చే సమయంలోనే దీన్ని ఓపెన్ చేస్తారు. పూర్తిస్థాయిలో నిండాక తూమును మూసేస్తారు. చిన్న గోప్లాపూర్ నుంచి భూత్పూర్ వరకు ఉన్న మెయిన్ కాలువ పొడవు 6.54 కిలోమీటర్లు.
మెయిన్ కెనాల్ బెడ్ విడ్త్ 17.25 మీటర్ కాగా పూర్తి పారక సామర్థ్యం 2.75 మీటర్లు. ఈ ప్రధాన కాలువ డిశ్చార్జ్ 55.210 క్యూసెక్కులు. కాగా 10.962 కిలోమీటర్ల వద్ద భూత్పూర్ రిజర్వాయర్‌కు మళ్లించేందుకు హెడ్ రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి నీళ్లు ఈ రిజర్వాయర్‌కు చేరుతాయి. ఈ రెగ్యులేటర్ నుంచి 16.230 క్యూసెక్కులు మళ్లిస్తారు. ఈ కాలువ వెడల్పు 6.230 మీటర్లు సైప్లె డెప్త్ 2.222 మీటర్లు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉన్నది.
జూరాల రిజర్వాయర్‌లో నీటి నిల్వ నుంచి భీమా ఫేజ్-1 ద్వారా ఇప్పటికే ఉన్న రెండు రిజర్వాయర్లు నింపేందుకు కనీసం 30రో జు లు పడుతుంది. మరోవైపు కాలువలు పెంచకుండా.. కృష్ణానది సోర్స్ నుంచి వచ్చే ప్రధాన కాలువను కూడా పట్టించుకోకుండా కేవలం సంగంబండ రిజర్వాయర్‌కు వెళ్లే కాలువ ద్వా రా మాత్రమే కొడంగల్‌కు నీళ్లు ఇస్తామంటే అది సాంకేతికంగా సాధ్యం కాదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన కాలువ నుంచి హెడ్ రెగ్యులేటరీ ద్వారా భూత్పూర్ రిజర్వాయర్‌కు మళ్లే నీటి వివరాలు పరిశీలిస్తే 572.9 క్యూసెక్కుల (16.230 క్యూమెక్స్) ప్రవాహంతో టీఎంసీ నిండడానికి 20 రోజుల సమయం పడుతున్నది.
ఈ లెక్కన కొడంగల్‌కు అవసరమైన 7 టీఎంసీలను ఎలా తరలిస్తారనేది అంతుచిక్కడం లేదు. ఈ కాలువను పెంచాలనే ప్రతిపాదన అసలు కొడంగల్ లిఫ్ట్‌లో లేకపోవడం గమనార్హం. ఆదరాబాదరగా పనులు ప్రారంభించడం చూస్తుంటే ముఖ్యనేత, నంబర్ 2 మంత్రి కంపెనీకి కాంట్రాక్టు అప్పగించి కమీషన్లు దండుకోవడానికే పనులు తెచ్చారన్న విమర్శలున్నాయి.
నారాయణపేట జిల్లాలో తొలిసారి గెలిచిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యేకు వ్యూహాత్మకంగా ముఖ్యనేత మంత్రి పదవి అప్పజెప్పినట్టు తెలుస్తున్నది. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు నీరు రావాలంటే సదరు మంత్రి నియోజకవర్గం నుంచే రావాలి. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకుంటే ఈ లిఫ్టు మొదలయ్యేది కాదని సదరు మంత్రి అనుచరులే చెప్తున్నారు. పదవి ఇచ్చి పనులను కూడా చక్కబెట్టే బాధ్యతను అప్పగించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
స్థానిక మంత్రి అండదండలతో పనులు దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అనుమతులు లేకుండా అడ్డగోలుగా కాట్రేప ల్లి వద్ద నిర్మిస్తున్న పంప్‌హౌస్ వద్ద బ్లాస్టింగ్ చేపడుతున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు ఈ పంప్ హౌస్ నిర్మాణం కోసం మాగనూరు పెద్దవాగు నుంచి అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్నారు.
భీమా ఫేజ్-1 ప్రధాన కాలువ నుంచి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు నీటిని తరలించే హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం సూచించే బోర్డు ఇది. ప్రధాన కాలువ నుంచి హెడ్ రెగ్యులేటరీ ఓపెన్ చేస్తే భూత్పూర్ రిజర్వాయర్‌కు వెళ్లే కాలువ పొడవు, వెడల్పు ఎంతో చూడగానే అంచనా వేయొచ్చు.. దీని వెడల్పు 6.50 మీటర్లు, డెప్త్ 2.222 మీటర్లు.. ఈ కాలువలో 572.9 క్యూసెక్కుల ప్రవాహంతో భూత్పూర్ రిజర్వాయర్‌లో టీఎంసీ నిండడానికి 20 రోజులు పడుతుంది..
ప్రాజెక్టు రిపోర్ట్‌లో పేర్కొన్న నీటి లభ్యత, తరలింపు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉన్నది. కృష్ణా నదికి గరిష్ఠంగా 52 రోజులు, కనిష్ఠంగా 30 రోజులు వరదలు వస్తుంటాయి. అయినా కొడంగల్ లిఫ్ట్‌ను నేరుగా జూరాలపై ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే నిర్మించి, వినియోగంలో ఉన్న భీమా ఫేజ్-1 లిఫ్ట్‌లో భాగమైన భూత్పూర్ రిజర్వాయర్ నుంచే కొడంగల్ లిఫ్ట్‌ను ప్రతిపాదించారు. ఇదిలా ఉంటే భీమా ఫేజ్-1 లిఫ్ట్ కోసం జూరాలపై పంచ్దేవ్ పహాడ్ వద్ద పంపుహౌస్ ఇప్పటికే నిర్మించి ఉన్నది. అక్కడి నుంచి రెండు పంపుల ద్వారా 1500 క్యూసెక్కుల జలాలను తరలిస్తున్నారు. దీనిపై గరిష్ఠంగా 70,000, కనిష్ఠంగా 45 వేల ఎకరాలకు ప్రస్తుతం సాగునీరు అందుతుంది.
పంచ్దేవ్ పహాడ్ పంప్‌హౌస్ లిఫ్ట్ నుంచే సంగం బండ, భూత్పూర్ రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు. అందులో సంగం బండ కెపాసిటీ 3 టీఎంసీలు. కొడంగల్ లిఫ్ట్‌ను ప్రతిపాదించిన భూత్పూర్ రిజర్వాయర్ సామర్థ్యం టీఎంసీ మాత్రమే. పంచ్దేవ్ పహాడ్ వద్ద రెండు పంపులను ఆన్‌చేస్తే నిరంతరాయంగా ఎత్తిపోస్తేనే భూత్పూర్ రిజర్వాయర్ నిండడానికి దాదాపు 45 రోజులు పడుతుంది. మరి ఈ రిజర్వాయర్ నుంచి కొడంగల్ కోసం 7 టీఎంసీలు ఎలా తీసుకెళ్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అదేమంటే ప్రస్తుతం పంచ్దేవ్ పహాడ్ వద్ద కొడంగల్ లిఫ్ట్ కోసం అదనంగా మరో పంపు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. 3 పంపులను కలిపినా గరిష్ఠంగా 1,500 క్యూసెక్కులు తరలించడం గగనమేనని ఇంజినీర్లు చెప్తున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం భీమా ఫేజ్-1లో తరలిస్తున్న 1,500 క్యూసెక్కులకు అదనంగా కొడంగల్ కోసం మరో 1700 క్యూసెక్కులను తరలించాలనే లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారన్నది అంతుబట్టని అంశం. కొడంగల్-నారాయణపేట ఆయకట్టుకు నీటిని ఎలా అందిస్తారనేదీ అంతుచిక్కకుండా ఉన్నది.