హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మరో 17 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అటానమస్ హోదాను దక్కించుకున్నాయి. ఇప్పటికే ఈ కాలేజీలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) నుంచి ‘ఏ’ గ్రేడ్ లభించడంతో తాజాగా వాటికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అటానమస్ హోదాను కల్పించింది. నిరుటి వరకు రాష్ట్రంలో 15 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా లభించింది. ఇప్పుడు మరో 17 కాలేజీలకు అటానమస్ హోదా లభించడంతో రాష్ట్రంలో ఈ హోదా దక్కించుకున్న కాలేజీల సంఖ్య 32కు పెరిగింది. అటానమస్ హోదా కల్పించేందుకు నిర్దేశించిన నిబంధనల్లో ఇటీవల యూజీసీ పలు మార్పులు చేసింది. వర్సిటీలతో సంబంధం లేకుండా నేరుగా యూజీసీకి దరఖాస్తు చేసుకునేలా పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పదేండ్ల క్రితం ఏర్పాటైన కాలేజీలతోపాటు న్యాక్ ఏ గ్రేడ్ పొందిన కాలేజీలకు తొలుత 10 ఏండ్లపాటు అటానమస్ హోదాను కల్పిస్తున్నది. 15 ఏండ్ల పాటు అటానమస్ హోదా కలిగి ఉన్న కాలేజీలకు శాశ్వత అటానమస్ హోదాను కల్పిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 153 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 90కిపైగా కాలేజీలు న్యాక్ గుర్తింపు ఫొందాయి.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ – భద్రాచలం, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ – పాల్వంచ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ – జగిత్యాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ – కామారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ – బిచ్కుంద, ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ-బాన్సువాడ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ – కరీంనగర్, జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ -సత్తుపల్లి, నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ-మహబూబాబాద్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ – బోధన్, బీజేఆర్ డిగ్రీ కాలేజీ – నారాయణగూడ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ – ఖైరతాబాద్, వివేకానంద డిగ్రీ కాలేజీ – విద్యానగర్, డాక్టర్ బీఆర్ఆర్ డిగ్రీ కాలేజీ – జడ్చర్ల, ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ -మహబూబ్‌నగర్, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ – పాలెం, కేఆర్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ – కోదాడ.