హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆటో డ్రైవర్లు చస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవం జరుపుకుంటున్నదని రాష్ట్ర ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారని, కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్లు బిక్షం ఎత్తుకొని బతకాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. డ్రైవర్ల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి చోద్యం చూస్తున్నదని విమర్శించారు. ఆటో డ్రైవర్లతో డిసెంబర్లో చర్చలు జరపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధర్నాచౌక్‌లో తెలంగాణ రాష్ట్ర ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం మహా ధర్నా జరిగింది. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రవిశంకర్, సమ్మయ్య యాదవ్‌లు మాట్లాడుతూ.. కేంద్రం పెంచిన రవాణా వాహనాల ఇన్సూరెన్స్ 50 శాతం తగ్గించాలని డిమాండ్ చేశారు. నగరంలోకి గూడ్స్ వాహనాల అనుమతి సమయం పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం.. ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్, జహంగీర్, జేబీఎస్ శ్రీనివాస్, యన్ కిషన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.