వరంగల్ చౌరస్తా, జూన్ 18: తన ఆటోలో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన సుమారు 15లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులకు ఇచ్చి ఆటోడ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతానికి చెందిన ఏ సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం వరంగల్‌లోని రామన్నపేటలో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యాడు. ఆ తర్వాత వరంగల్ బస్‌స్టాండ్ నుంచి రామన్నపేటకు వెళ్లేందుకు మిర్జా ఇఫ్తేకార్ బేగ్ ఆటోలో ప్రయాణించాడు.
ఆ సమయంలో ఆటోలో తన బట్టల బ్యాగుతోపాటు రూ.15లక్షల విలువైన సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను మర్చిపోయాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన సత్యనారాయణ మట్టెవాడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో వరంగల్ బస్‌స్టాండ్ ప్రాంతంలో సీసీ ఫుటేజీలను పరిశీలించాలని భావిస్తుండగా, సత్యనారాయణ మర్చిపోయిన బ్యాగుతో ఇఫ్తేకార్ బేగ్ మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులకు అందజేశారు. దీంతో ఆటోడ్రైవర్ నిజాయితీకి మెచ్చిన మట్టెవాడ సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై శివకృష్ణ అతడిని శాలువాతో సత్కరించి, అభినందించారు.