TG Budget | హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ): ఆటోడ్రైవర్ల ఆశలు అడియాసలయ్యాయి. ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్థికంగా నష్టపోతున్న లక్షలాది మంది ఆటోడ్రైవర్లకు ఆదుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్.. ఈ బడ్జెట్లోనూ మొండిచెయ్యే చూపింది. ఏడాదికి రూ.12వేల జీవనభృతి కల్పిస్తామని, కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ హామీని ఎగ్గొట్టింది.
రెండున్నరేండ్ల నుంచి ఎదురుచూసిన ఆటోడ్రైవర్ల నోట్లో మళ్లీ మట్టికొట్టింది. బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించలేదు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని, కిరాయిలు లేక, కిస్తీలు కట్టలేక రుణభారంతో ఇప్పటికే 180మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నా, ప్రభుత్వం ఈ బడ్జెట్లో కనికరించకపోవడం దారుణమని ఆటోడ్రైవర్ల జేఏసీ అధ్యక్షుడు మారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తక్షణమే ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 6లక్షల మంది డ్రైవర్లు ఆటోలనే నమ్ముకొని బతుకుతున్నారని వారిని ఆదుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అయితే, ఏపీలో అక్కడి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నష్టపోతున్న ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.15వేలు అమలు చేస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.