హైదరాబాద్ సిటీబ్యూరో/మల్కాజిగిరి/జవహర్‌నగర్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): పోలీసుల వేధింపులు ఓ ఆటో డ్రైవర్‌ను (Auto Driver) బలితీసుకున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో (Drunk and Drive) పట్టుబడ్డ ఆటోను తిరిగి ఇవ్వాలంటూ వేడుకున్న డ్రైవర్‌ను.. పోలీసులు పరుష పదజాలంతో తిట్టడం, ఆటోను సీజ్ చేసినట్టు బెదిరించడంతో, తన యజమానికి ఏమి చెప్పాలో అర్థం కాక మనస్తాపానికి గురై పోలీస్‌స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ గంటల వ్యవధిలో మృతి చెందాడు. పోలీసులు ఆగమేఘాలపై రాత్రికి రాత్రే ఫిర్యాదు తీసుకొని, తెల్లవారే వరకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆటో డ్రైవర్లు ప్రభుత్వ వైఖరిని, పోలీసుల వేధింపులను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. జరిగిన ఘటనపై స్పష్టత ఇవ్వకుండానే కుటుంబ సభ్యులపై పోలీసులు ఒత్తిడి తెచ్చి హడావుడిగా అంత్యక్రియలు పూర్తిచేశారని ఆరోపించారు.
ఫ్రీ బస్సుతో రోడ్డునపడ్డ ఆటో డ్రైవర్లు ప్రభుత్వంపై మండిపడుతుండటం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఈ విషయాన్ని సద్దుమణిగించేందుకు విఫలయత్నం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని జమ్మిగడ్డ-భరత్‌నగర్‌కు చెందిన అంజిరెడ్డి, పుష్పమ్మకు ము గ్గురు కొడుకులు. చిన్న కొడుకు సింగిరెడ్డి మీన్‌రెడ్డి (32) ఆటోను లీజుకు తీసుకొని నడుపుతున్నాడు. ప్రభుత్వం ఫ్రీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఆటో గిరాకీ పూర్తిగా దెబ్బతిన్నది. ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులకు వైద్యం చేయించేందుకు డబ్బు లేక, కుటుంబం గడవడమే కష్టంగా మారిందని ఆవేదన చెందుతుండేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి ఆటో నడుపుకుంటూ వెళ్తూ.. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు రాధిక థియేటర్ వద్ద ఏర్పాటుచేసిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. బీఏసీ 120 ఎంజీ వచ్చింది. మద్యం మత్తులో ఉన్న మీన్రెడ్డిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తన ఆటో తనకు ఇవ్వాలని, ఆటో యజమానికి అప్పగించాల్సి ఉన్నదని పోలీసులను వేడుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న నీకు ఇప్పుడు ఆటో ఇవ్వడం కుదరదని పోలీసులు తేల్చి చెప్పారు. ఏమిచేయాలో తెలియక మీన్‌రెడ్డి తనకు తెలిసిన వారిని ఆటో నడిపేందుకు రమన్నాడు. ఎవరూ రాకపోవడంతో రాత్రి 10.30 గంటల సమయంలో మౌలాలీలో ఉన్న కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. తాను తాగిన మత్తు దిగిపోయిందని, రేపు కోర్టుకు హాజరవుతానని, ఆటోను తిరిగి ఇవ్వాలంటూ ట్రాఫిక్ పోలీసులను వేడుకున్నాడు. పోలీసులు మాత్రం ఆటో ఇవ్వబోమని, సీజ్ చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతనిని పరుష పదజాలంతో దూషించారనని ఆరోపణలొస్తున్నాయి. యజమానికి ఏమి చెప్పాలో అర్థంకాక మనస్తాపానికి గురైన మీన్‌రెడ్డి పెట్రోల్‌బంక్‌కు వెళ్లి డబ్బాలో పెట్రోల్ తెచ్చుకొని, కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ముందు ఒంటిపై పోసుకున్నాడు. ట్రాఫిక్ పోలీసులు స్పందించి మంటలు అర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే 70% గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఈ విషయాన్ని మల్కాజిగిరి లా అండ్ అర్డర్ పోలీసులకు చెప్పడంతో పోలీసులు కూడా గాంధీ దవాఖానకు చేరుకున్నారు.
కుటుంబ సభ్యులకు సమాచారం!
గాంధీ దవాఖానలో చికిత్స నిమిత్తం మీన్‌రెడ్డిని చేర్పించిన పోలీసులు.. రాత్రి 2 గంటల ప్రాంతంలో అతని సోదరులు, తల్లిదండ్రులను తీసుకొని గాంధీ దవాఖానకు వెళ్లారు. ఏమి జరిగిందో వారికి పూర్తిగా వివరించకుండా, మీన్‌రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడని చెప్పారు. ఆటో డ్రైవర్ ఆత్మహత్య యత్నం చేశాడనే సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు గాంధీ దవాఖాన వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, చికిత్స పొందుతున్న మీన్రెడ్డికి గుండెపోటు రావడంతో మృతి చెందాడు.
హడావుడిగా పోస్టుమార్టం!
తాగి ఆటో నడుపుతున్న మీన్‌రెడ్డి.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిపి, వారి నుంచి ఆ మేరకు ఫిర్యాదు తీసుకున్నారు. బుధవారం ఉదయం 9 గంటల వరకు పోస్టుమార్టం పూర్తి చేయించి, మృతదేహాన్ని అంబులెన్స్‌లో భరత్‌నగర్‌కు తరలించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
నా కొడుకు పిరికివాడు కాదు: పుష్పమ్మ, మృతుడి తల్లి
తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరో చంపేశారని మృతుడి తల్లి పుష్పమ్మ ఆరోపించారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. కెమెరాలు బయటపెట్టండి, ఏమి జరిగిందో తెలుస్తుందంటూ ఆమె రోధించింది. రాత్రి ఒంటి గంటకు మాకు చెప్పిండ్రు.. కెమెరాలు చూపించేంత వరకు కొడుకు శవాన్ని తీయనంటూ ఆవేదన వ్యక్తంచేసింది. అయితే, పోలీసులు మాత్రం మృతదేహానికి త్వరగా అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేశారని స్థానికులు చెప్తున్నారు. తమ వద్దకు వచ్చిన పోలీసులు ఏమి జరిగిందో స్పష్టంగా చెప్పలేదని మీన్‌రెడ్డి సోదరులు తెలిపారు.
తాగి ఉండటంతో వాహనం ఇవ్వలేదు: పోలీసులు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మీన్‌రెడ్డి పట్టుబడాడని, తాగి వాహనం నడిపితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని, మద్యం తాగని వాళ్లు ఎవరైనా వస్తే డ్రైవింగ్ లైసెన్స్ చూసి ఆటో ఇస్తామని చెప్పినట్టు కుషాయిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్‌రాజు తెలిపారు. వాహనం ఇవ్వకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు కొద్ది దూరంలో పెట్రోల్ పోసుకున్నాడని, తమ సిబ్బంది వెంటనే అతనిని రక్షించేందుకు ప్రయత్నించి, చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారని వివరించారు. మల్కాజిగిరి లాఅండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. దవాఖాన నుంచి సమాచారం రావడంతోనే తాము వెళ్లామని, కుటుంబ సభ్యులు అక్కడే ఉండటంతో వారి నుంచి ఫిర్యాదు తీసుకున్నామని తెలిపారు. పోలీసుల వేధింపులు అనేవి నిరాధారమైనవని పేర్కొన్నారు.