కోనరావుపేట, మార్చి 20 : ఉపాధి కరువై రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ఆటో డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ వైపు అప్పులు, మరోవైపు అనారోగ్యంతో తండ్లాడిన ఆయన, ఆటో కిస్తీలు కట్టలేక పోయాడు. కనీసం రెండు వేల అప్పు కూడా పుట్టకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన జెట్టి లచ్చయ్య (60), భార్య కనుకవ్వ దంపతులకు నలుగురు ఆడపిల్లలు. ఆటో నడుపుకొని జీవించే లచ్చయ్య, తన నలుగురి బిడ్డల పెండ్లిళ్లు రెండేండ్ల క్రితమే చేశాడు. ఈ క్రమంలో 30 గుంటల వ్యవసాయ భూమితోపాటు ఇల్లు అమ్ముకున్నాడు. ఏడాది కిందట గుండెపోటు రాగా, స్టెంట్ వేయించుకున్నాడు.
ఆరు నెలల క్రితం తన పాత ఆటోను అమ్మి, రూ.3.80 లక్షలకు ఫైనాన్స్‌లో కొత్త ఆటో కొన్నాడు. ప్రతి నెలా ఒకటో తేదీన రూ.ఆరు వేల కిస్తీ కడుతున్నాడు. మహాలక్ష్మీ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి గిరాకీ తగ్గిపోవడంతో ప్రతి నెలా కిస్తీ కట్టడానికి ఇబ్బందులుపడుతున్నాడు. మార్చి ఒకటో తేదీన కిస్తీ కట్టేందుకు డబ్బులు లేక.. తన వృత్తి అయిన చేపలు పట్టి రూ.నాలుగు వేలు జమచేశాడు. మరో రూ.రెండు వేలు అప్పు దొరక్కపోవడం, మరోవైపు అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికి సైతం డబ్బులు లేకపోవడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఇంటి సమీపంలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య కనుకవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ గుండ వెంకటేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నర్సింహులపేట, మార్చి 20 : ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజ్ బిగించే విషయంలో విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యం చేయడంతో ఓ రైతు స్వయంగా ఫ్యూజ్ వేసే క్రమంలో విద్యుత్తు షాక్ కొట్టి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగులో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంగిమడుగు గ్రామానికి చెందిన డప్పుకటి నరేశ్ (30) తనకున్న ఎకరంలో వరి సాగు చేశాడు. వరి పొట్టదశలో ఉండటంతో పొలానికి నీళ్లు పెట్టేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు.
మోటర్ నడవకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించగా ఫ్యూజ్ పోయినట్టు గుర్తించాడు. దీంతో సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లి విషయం చెప్పడంతో ఎవరూ స్పందించలేదు. పొట్ట దశకు వచ్చిన పొలం ఆరిపోతే చేతికి రాదనే బాధతో నిచ్చెన సాయంతో ఫ్యూజ్ వేసే క్రమంలో కరెంట్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన నరేశ్‌ను చికిత్స నిమిత్తం తోటి రైతులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖాకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.