గంగాధర, జూన్ 23 : ‘నేను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దగ్గర పని చేస్తున్నా.. నాతో పెట్టుకుంటే టార్చర్ తప్పదు. నీకు ప్రాణం ముఖ్యమా, బిల్లు ముఖ్యమా?.. నాతో పెట్టుకుంటే అంతు చూస్తా..’ అంటూ ఓ యువకుడు విద్యుత్తు సిబ్బందిని బెదించిన ఓ వాయిస్ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లికి చెందిన ఓ యువకుడు ఏడాదికాలంగా విద్యుత్తుబిల్లు చెల్లించడంలేదు. సోమవారం సదరు యువకుడి ఇంటికి వెళ్లిన విద్యుత్తుసిబ్బంది కరెంటు బిల్లు చెల్లించుకుంటే కనెక్షన్ కట్ చేస్తామని చెప్పారు.
దీంతో సదరు యువకుడు విద్యుత్తు సిబ్బందితో తాను ఎమ్మెల్యే అనుచరుడిని అంటూ బెదిరించాడు. ఈ విషయమై విద్యుత్తు సిబ్బందిని వివరణ కోరగా బిల్లు చెల్లించాలని కోరితే సదరు యువకుడు బెదిరించాడని తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను వివరణ కోరగా సదరు యువకుడి గురించి తనకు తెలియదని, తన పేరుతో విద్యుత్తు సిబ్బందిని బెదిరించిన విషయాన్ని చొప్పదండి సీఐ దృష్టికి తీసుకువెళ్లి విచారణ చేయవలసిందిగా కోరినట్టు వివరించారు.