హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు యూరియా కొరతను తీర్చడంపై వెంటనే దృష్టి పెట్టాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు శ్రీహరిరావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అవసరమైన యూరియా కోసం కేంద్రాన్ని ఒప్పించాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. సరఫరా ఆలస్యమైతే లక్షలాది మంది రైతులకు అపార నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రితో పాటు ఆశాఖ ఉన్నతాధికారులు, అన్ని పార్టీల ఎంపీలతో కలిసి తక్షణమే కేంద్ర మంత్రులు, అవసరమైతే ప్రధానమంత్రిని కలవాలని విన్నవించారు. 2025 ఖరీఫ్‌లో రాష్ట్రానికి అవసరమయ్యే యూరియా ఇండెంట్, ఇప్పటివరకు జరిగిన సరఫరా, లోటు పరిస్థితులు, తద్వారా రైతులకు జరిగే నష్టాన్ని సమగ్రంగా వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నదని గుర్తుచేశారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో యూరియా రాకుంటే ప్రత్యామ్నాయంగా నానో యూరియాను సబ్సిడీపై సరఫరాకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎరువుల సరఫరాపైఅప్రమత్తంగా ఉండాలి ; వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : వరినాట్లు ముగిసి యూరియా వినియోగం పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎరువుల సరఫరాపై అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వ్యవసాయ కమిషనరేట్‌లో యూ రియా సరఫరాపై కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్రం రాష్ర్టానికి 1.70 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించిందని, సకాలంలో సరఫరా చేయాలని సూచించారు.