హైదరాబాద్ సిటీబ్యూరో/బడంగ్‌పేట, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో అధికార పార్టీ నేతల భూ దాహానికి అడ్డులేకుండా పోయింది. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట పరిధిలోని బాలాపూర్ శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ భూములపై అధికారపార్టీ నేతల కన్నుపడింది. భూములను దక్కించుకొని, వాటిని అమ్మేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో ఎకరాకు రూ.15-20 కోట్లు పలుకుతున్న ఈ విలువైన భూమిని కొట్టేసేందుకు ఓ మంత్రి రంగంలోకి దిగారట. నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వమంటూ తన అనుచరుల ద్వారా దేవాదాయ శాఖ అధికారులను ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. కంచె చేను మేసినట్టుగా దేవుని మాన్యాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్ అధికారులు పక్కకు తప్పుకోవడంతో ‘గోపాలా.. నీ భూమికి ఎవరు కాపలా?’ అంటూ స్థానికులు నిట్టూర్చుతున్నారు. బడంగ్‌పేట పరిధిలోని బాలాపూర్ శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా పేరుపొందినది.
ఆస్తులు కూడా ఎక్కువే. అందుకే వాటిని కాజేసేందుకు అక్రమార్కులు ఈగల్లా వాలుతుంటారు. బాలాపూర్ లడ్డూకు ఎంత పేరున్నదో.. వేణుగోపాలస్వామి ఆస్తులపై అంతమంది కన్నుంటుందని స్థానికంగా చమత్కరిస్తుంటారు. 1971లో ఆలయాన్ని రిజిస్టర్ చేసే సమయంలో బాలాపూర్‌లోని సర్వే నంబర్లు 14, 68, 69,70ల్లో 19.05 ఎకరాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇందులో సర్వే నంబర్ 14లో 1.04 ఎకరాలు, 68లో 2.13 ఎకరాలు, 69లో 3.10 ఎకరాలు, 70లో 12.18ఎకరాల భూమి ఉన్నట్టుగా దేవాదాయ శాఖ రికార్డుల్లో నమోదై ఉన్నది. ఈ భూములను దేవాదాయ భూములుగా పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నవంబర్ 2022లో విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొన్నారు. ఈ భూమి బాలాపూర్ బడంగ్‌పేట ప్రధాన రహదారిపై ఏఆర్‌సీఐ పక్కనే ఉన్నది. ప్రస్తుతం ఇక్కడ భూముల ధర మార్కెట్లో ఎకరానికి రూ.15-20 కోట్లు పలుకుతున్నది. దీంతో ఎలాగైనా ఈ భూమిని దక్కించుకుని అమ్మేయడానికి స్థానిక అక్రమార్కులు, అధికారపార్టీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎకరాకు రూ.6 కోట్లకు బేరసారాలు జరుగుతున్నట్టు సమాచారం. ముందుగా ఆరు ఎకరాలు అమ్మేసి, విడతల వారీగా మిగతావాటిని కూడా అమ్మేయాలని నిర్ణయించుకున్నట్టు చర్చ జరుగుతున్నది.
ఎన్వోసీ కోసం ఓ మంత్రి?
అక్రమార్కులు చేస్తున్న ప్రయత్నాలకు ఓ మంత్రి సహకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం భూమికి దేవాదాయ శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్వోసీ) తేవడానికి మంత్రి తనదైన శైలిలో అధికారులను ఒత్తిడి చేస్తున్నారట. ఇప్పటికే తన మనుషులతో ఆ శాఖలోని ఉన్నతాధికారులు మొద లు నాలుగో తరగతి ఉద్యోగుల వరకు మేనేజ్ చేసి రికార్డులన్నీ తీసుకున్నట్టు తెలిసింది. అవసరమైతే దేవాదాయ శాఖలో రూ.కోటి వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధమని మంత్రి అనుచరులు అక్కడి సిబ్బందితో అన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్వోసీ కోసం నయానో, భ యానో ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ భూమిపై మరో మంత్రి కన్ను కూడా పడిందని, తమ మంత్రికి కూడా వాటా ఇవ్వాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నట్టు ప్రచా రం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అధికారులు ఎవరైనా ఆ భూముల గురించి మాట్లాడితే చర్యలు ఉంటాయని హెచ్చరించినట్టు సమాచారం.
పట్టించుకోని దేవాదాయ శాఖ
బాలాపూర్ వేణుగోపాలస్వామి ఆల యం 6సీ క్యాటగిరీలో ఉన్నది. ఆలయ ఆ స్తులను పరిరక్షించేందుకు ఈవోను నియమించడంలో ప్రభుత్వం మొదటినుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. గతంలో రెండెకరాల్లో వేరేవారు షెడ్లు వేయగా సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి షెడ్లను తొలగించారు. ఆ తర్వాత ఏ ఎండోమెంట్ అధికారి కూడా ఆలయ భూముల వైపే చూ డలేదని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయ ఈవోకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కానీ తనకే రెండు పెద్ద దేవాలయాలు ఉన్నాయంటూ కర్మన్‌ఘాట్ ఈవో ఇప్పటివరకు ఈ ఆలయానికి చార్జ్ తీసుకోలేదు. గతంలో ఈవోగా పనిచేసిన ఉద్యోగి మాత్రం ఉద్దేశపూర్వకంగానే తనను బదిలీ చేసి అడ్డు తొలిగించుకున్నారని ఆరోపిస్తున్నారు. రూ.కోట్ల విలువైన భూమిని కొట్టేయడానికి కబ్జాదారులు ప్రయత్నిస్తుంటే ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
నాకు బాధ్యతలే అప్పగించలేదు
కర్మన్ఘాట్తోపాటు గణేశ్‌గడ్డ దేవాలయాలకు నేను ఇన్చార్జ్గా ఉన్నాను. బాలాపూర్ వేణుగోపాలస్వామి గుడి ఇన్చార్జిగా చేయమంటే వద్దని మా ఉన్నతాధికారులకు చెప్పాను. కొత్తగా వచ్చిన ఈవోలలో ఎవరికో ఒకరికి గుడి బాధ్యతలు ఇస్తామని చెప్పారు. గతంలో పనిచేసిన ఈవో నాకేం బాధ్యతలు అప్పగించలేదు. భూముల గురించి, గుడి గురించి నాకేం తెలియదు.
-లావణ్య, ఈవో, కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవస్థానం
ఆస్తులున్నాయి, ఆదాయం లేదు
నేను ఈ ఆలయానికి వచ్చి మూడు సంవత్సరాలైంది. అప్పట్లో ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం నిధులిచ్చినట్టుగా తెలిసింది. అప్పుడు ఏర్పడ్డ కమిటీ నాకు జీతమిచ్చారు. ఆలయానికి కోట్ల రూపాయల విలువైన భూములు ఆస్తులుగా ఉన్నా.. ఆదాయం మాత్రం లేదు. ఆలయం చాలా ప్రాచీనమైనది. ఎండోమెంట్ ఆఫీసర్లు ఎప్పుడూ రాలేదు. మేం వచ్చిన తర్వాత కమిటీ ప్రమాణస్వీకారానికి ఒక అధికారి వచ్చి పోవడమే తప్ప ఆలయాన్ని దేవాదాయ శాఖ పట్టించుకోదు.
-గీతాకృష్ణమాచార్యులు, ఆలయ అర్చకుడు