
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగుకు తెలంగాణ రైతాంగం సానుకూలత వ్యక్తం చేస్తున్నది. ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ పంటల కొనుగోలుకు, మద్దతు ధరకు భరోసా ఇవ్వాలని కోరుతున్నది. అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని చెప్తున్నది. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయశాఖ సర్వే మంగళవారంతో పూర్తయింది. సర్వే ప్రకారం వ్యవసాయశాఖ నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించనున్నది. దీని ప్రకారమే యాసంగిలో సాగు ప్రణాళిక చేపట్టనున్నారు. ఈ ఏడాది యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లో దొడ్డు వడ్లను కొనబోమని కేంద్రప్రభుత్వం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్లో ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యవసాయశాఖ ముందస్తుగా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టింది. నెలరోజులుగా క్షేత్రస్థాయిలో రైతువేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ప్రత్యామ్నాయ పంటలపై రైతుల అభిప్రాయాలను సేకరించింది. ఈ యాసంగిలో వరిసాగును కనీసం 30 శాతం తగ్గించేందుకు వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటున్నది.
పంటల మార్పిడిపై జిల్లాలవారీగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. జోగులాంబ గద్వాల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రమే పంటల మార్పిడికి ఎక్కువ అవకాశమున్నట్టు వ్యవసాయశాఖ తేల్చింది. 11 జిల్లాల్లో కొద్దిగా అవకాశాలున్నాయి. 18 జిల్లాల్లో మాత్రం పంట మార్పిడి చాలా కష్టమని.. 75-98శాతం రెండు పంటలుగా వరి మాత్రమే సాగవుతుందని వెల్లడైంది. ప్రాజెక్టుల కింద, చౌడు భూముల్లో వరి తప్ప మరో పంట సాగు చేయలేని పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ఎక్కువగా బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ యోచిస్తున్నది.
యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ, మినుము, పెసర, శనగ పంటల సాగును పెంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ పంటల సాగును కనీసం 7.50 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నది. వేరుశనగ 2 లక్షలు, మినుములు 1.82 లక్షలు, పెసర 3 లక్షలు, శనగపంట 51 వేలు, మొక్కజొన్నను 40 వేల ఎకరాలు పెంచాలని ప్రణాళికలు రూపొందించారు.
