Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. కొరియాకు చెందిన యువతి హాయిన్ (జిన్నీ)తో ప్రేమలో ఉన్న సిద్ధార్థ్, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆదివారం ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ శుభకార్యానికి మహేష్ బాబు కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు హాజరై సందడి చేశారు. మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ప్రత్యేక ఫొటోలను షేర్ చేస్తూ కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ ఫొటోలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఫొటోల్లో నమ్రతతో పాటు మహేష్ బాబు సోదరీమణులు, కుటుంబ సభ్యులు కనిపించారు. ముఖ్యంగా మహేష్ అన్న దివంగత రమేష్ బాబు కుమార్తె భారతి కూడా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా అరుదుగా పబ్లిక్‌లో కనిపించే భారతి ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో అభిమానులు ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. సిద్ధార్థ్ గల్లా ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ మరియు పద్మావతి దంపతుల చిన్న కుమారుడు. ఆయన అన్న అశోక్ గల్లా ఇప్పటికే హీరోగా టాలీవుడ్లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం అశోక్ గల్లా నటిస్తున్న ‘వీసా’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక సిద్ధార్థ్ గల్లా మాత్రం సినీ రంగానికి దూరంగా ఉండి కుటుంబ వ్యాపార వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా కొరియన్ యువతి హాయిన్‌తో ప్రేమలో ఉన్న ఆయన, ఇప్పుడు కుటుంబ సభ్యుల అంగీకారంతో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నిశ్చితార్థ వేడుక ఎంతో ఆత్మీయ వాతావరణంలో జరిగినట్లు ఫొటోలు చూస్తే స్పష్టమవుతోంది. మరోవైపు, మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.