ములుగు, ఆగస్టు 26 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ నాయకుడి హత్యకు కొందరు యత్నించారు. ఈ ఘటన ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది. బాధిత బీఆర్ఎస్ నాయకుడు, ఆత్మ కమిటీ జిల్లా మాజీ చైర్మన్ చంద చక్రపాణి తెలిపిన వివరాల ప్రకా రం.. చక్రపాణి స్వగ్రామమైన మల్లంపల్లిలో ఓ వివాహానికి హాజరై ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో జాతీయ రహదారి దాటే ప్రయత్నం చేస్తుండగా ములుగు నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు అతడిని ఢీకొట్టింది.
గాయపడ్డ అతడిని స్థానికులు ములుగు జీజీహెచ్ కు తరలించారు. ఇటీవల ఇసుక క్వారీ ల విషయంలో తనను కొందరు కాంగ్రె స్ నాయకులు కారులో వెంబడించి తా డ్వాయి మండలం కొండపర్తి స్టేజీ వద్ద ఆపి తన కారుపై దాడి చేశారని చక్రపాణి మరుసటి రోజు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు సదరు వ్యక్తులను పట్టుకోకపోవడంతో ప్రాణభయం ఉన్నదని మంగళవారం ములుగులో మీడియాతో మాట్లాడి తనకు రక్షణ కల్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
తాను పోలీసులకు విన్నవించిన మరుసటి రోజే తన స్వగ్రామంలో బ్లూ కలర్ కారుతో వేగంగా వచ్చి ఢీకొట్టారని, తాడ్వాయి అడవుల్లో వెంబడించిన వాహనాల్లో సైతం బ్లూ కారు ఉన్నదని, సదరు వ్యక్తులు తనను ఎలాగైనా చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారని బాధితుడు వాపోయాడు. తనపై జరుగుతున్న దాడుల వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉన్నదని ఆరోపించాడు. రక్షణ కల్పించాలని చక్రపాణి పోలీసులను మరోసారి కోరాడు.