మునిపల్లి, డిసెంబర్ 11: ఇద్దరు గురుకులం విద్యార్థుల కిడ్నాప్‌కు యత్నించిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో గురువారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. లింగంపల్లి గురుకుల పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న రాకేశ్, సిద్దార్థ గురుకులం ముందున్న రోడ్డు వద్ద ఉండగా.. ఎరుపురంగు కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. చాక్లెట్ ఇస్తాం కారులోకి రావాలని కోరారు. అందుకు వారు నిరాకరించారు. అయితే వారు విద్యార్థులను బలవంతంగా కారులోకి ఎక్కించుకొని గురుకులం పక్కన ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల వెనుక గల ఓ వ్యవసాయ పొలంలోకి తీసుకెళ్లి మత్తు పదార్థాలు ఇచ్చినట్టు సమాచారం. గమనించిన స్థానికులు అరవడంతో వారు విద్యార్థులను వదిలి పారిపోయారు.
విద్యార్థులను చికిత్స నిమిత్తం వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించామని, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో చేర్పించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. ఎన్నికల డ్యూటీ కారణంగా ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉన్నదని తెలిపారు. కాగా విద్యార్థుల కిడ్నాప్‌నకు యత్నం ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. పిల్లల ఆరోగ్యం విషయమై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గురుకులాల్లో రాత్రి బస సంక్రాంతి వరకే సెక్రటరీ హామీ ఇచ్చినట్టు ఉద్యోగుల సంఘం వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో రాత్రి బసకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు సంక్రాంతి సెలవుల వరకేనని సెక్రటరీ హామీ ఇచ్చినట్టు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం (టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ) వెల్లడించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి దయాకర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ గురుకులాల్లో ప్రతిరోజూ ముగ్గురు ఉపాధ్యాయులు, సెలవు రోజుల్లో నలుగురు ఉపాధ్యాయులు రాత్రి విధులు నిర్వహించాలని సొసైటీ ఉన్నతాధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ విషయాన్ని సొసైటీ సెక్రటరీ కృష్ణ ఆదిత్య దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్టు టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ తెలిపింది.
‘15లోపు పది నామినల్‌రోల్స్ సవరించుకోండి’
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి నామినల్ రోల్స్‌ను ఈ నెల 15లోపు సవరించుకోవాలని ఎస్సెస్సీ బోర్డు సూచించింది. 2026 వార్షిక పరీక్షలకు హాజరయ్యేవారు గడువులోగా సవరించుకోవాలని బోర్డు డైరెక్టర్ పీవీ శ్రీహరి సూచించారు.