Head Constable | వనస్థలిపురం, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): డయల్ 100కు వచ్చిన ఫోన్‌కాల్‌తో వెళ్లిన ఓ హెడ్ కానిస్టేబుల్ అక్కడి ఓ కుటుంబంతో పరిచయం చేసుకున్నాడు. వారితో ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించి, చివరకు ఆ కుటుంబంలోని మహిళను బెదిరించి లైంగికదాడికి యత్నించిన ఘటన వెలుగుచూసింది. హైదరాబాద్ వనస్థలిపురం ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కు సాహెబ్‌నగర్ గాయత్రీనగర్ ప్రాంతం నుంచి ఇటీవల డయల్ 100కు ఒక కాల్ వచ్చింది. ఆ సమస్య పరిశీలనకు పోలీసులు వెళ్లారు. వారిలో జగన్‌గౌడ్ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఆ సమయంలో అదే ప్రాంతంలో నివాసముండే బాధితురాలితో జగన్గౌడ్కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల వరకూ దారితీసింది. తన బంగారాన్ని కుదువపెట్టి డబ్బు తెచ్చి మరీ ఆమె కానిస్టేబుల్‌కు ఇచ్చింది. ఈ డబ్బు తిరిగి ఇవ్వడంలో కానిస్టేబుల్ జాప్యం చేస్తుండటంతో బాధితురాలు అతడిని నిలదీసింది. దీంతో ఈ నెల 4న ఇంజాపూర్‌లో కమాన్ వద్ద మా అమ్మానాన్న ఉన్నారని, వాళ్లిచ్చే డబ్బు ఇస్తానని నమ్మబలికి కారులో ఇంజాపూర్ వైపు తీసుకెళ్లాడు. ఓ నిర్జన ప్రదేశంలోకి తీసికెళ్లి ఆమెపై కానిస్టేబుల్ అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అక్కడి నుంచి ఆమె తప్పించుకొని ఇంటికి చేరుకున్నది. ఈ విషయంపై వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య వెల్లడించారు. సెక్రటేరియట్ మీడియా సెల్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వికలాంగుల సంక్షేమ శాఖలో అనేక అక్రమాలు జరిగాయని, జేడీ, విశ్రాంత ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వాటన్నింటిపై ఏసీబీ, విజిలెన్స్‌తో విచారణ జరిపిస్తామని తెలిపారు. సహకార సంస్థలో ఉన్నతస్థాయి ప్రమోషన్ల విషయంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలని, ఐఏఎస్‌ను డైరెక్టర్‌గా నియమించాలని కోరారు.