జనగామ చౌరస్తా, అక్టోబర్ 16 : పెండింగ్ బిల్లుల కోసం ఓ కాంట్రాక్టర్ కోర్టు ఉత్తర్వుల మేరకు గురువారం జనగామ కలెక్టరేట్లోని వ్యవసాయశాఖ కార్యాలయంలో ఫర్నిచర్ జప్తునకు యత్నించాడు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాలతో వ్యవసాయశాఖ అధికారి అంబికాసోని, కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్ సదరు కాంట్రాక్టర్‌తో చర్చలు జరిపి మూడు నెలలు గడువు కోరడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.
జనగామ జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే పరికరాలను సబ్సిడీపై అందించడానికి దీప్తి ఇంజినీరింగ్ అండ్ వెల్డింగ్ వర్క్స్ సంస్థ యజమాని కత్తుల రాజిరెడ్డితో గతంలో వ్యవసాయశాఖ ఒప్పందం చేసుకున్నది. దీంతో పరికరాలు తయారు చేసి ఇచ్చి నందుకు కాంట్రాక్టర్‌కు రూ.5,25,500 నాటి డీఏవో వీరూనాయక్ ట్రెజరీ చెక్కు జారీచేశారు. అయితే ఐదేళ్ల నుంచి చెక్కును అందజేయలేదు. దీంతో కోర్టును ఆశ్రయించగా, ఫర్నిచర్‌ను జప్తు చేసుకోవాలని తీర్పునిచ్చింది.