గజ్వేల్/తాంసి/ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 2: పత్తి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. రోజురోజుకూ ధరలు పైపైకి చేరుతున్నాయి. అనుకున్న దానికంటే అధికంగా ధరలు పలుకుతుండటంతో అన్నదాతలు సంబురపడు తున్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.8,759 ధర పలికింది. మొత్తం 34 మంది రైతులు 87 క్వింటాళ్ల పత్తిని తీసుకురాగా.. దౌల్తాబాద్ మండలం మాసాన్‌పల్లి రైతు లక్ష్మయ్యకు చెందిన 5.65 క్వింటాళ్ల పత్తిని రూ.8,759 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. కాగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూరులోని ఓ ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులో మంగళవారం క్వింటాల్ పత్తి ధర రూ.8,600 పలికింది. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో రూ.8,500గా నమోదైంది. కాగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ఆన్లైన్ బిడ్డింగ్‌లో పత్తి క్వింటాల్‌కు రూ.8,500 పలికింది. రాష్ట్రవ్యాప్తంగా పత్తి ధర పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.