Allu Arjun | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సంధ్య థియేటర్లో తొక్కిసలాట, సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణల నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించారు. పోలీసుల అనుమతి లేకుండానే థియేటర్‌కు వెళ్లి, రోడ్‌షో, ర్యాలీ నిర్వహించినట్టు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని స్పష్టంచేశారు. పోలీసుల అనుమతి తీసుకున్నామని థియేటర్ యాజమాన్యం చెబితేనే అక్కడికి వెళ్లానని తెలిపారు. శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల తర్వాత రాత్రి 8గంటల సమయంలో హైదరాబాద్‌లోని తన నివాసంలో అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎక్కడా ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండానే ఆయన చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. తొక్కిసలాట ఘటనలో తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని, చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
థియేటర్ నాకు దేవాలయం
సినిమా థియేటర్ తనకు దేవాలయంలాంటిదని, అక్కడ దురదృష్టకరమైన ఘటన జరిగితే తన కంటే ఎక్కువగా బాధపడేవాళ్లుంటారా? అన్ని అల్లు అర్జున్ ప్రశ్నించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని గంటగంటకు తెలుసుకుంటున్నాను. అతను కోలుకుంటున్నాడని తెలిసి చాలా ఆనందపడుతున్నాను. నేను ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని ఏ మాత్రం భరించలేకపోతున్నా. శ్రీతేజ్ భవిష్యత్తు కోసం పెద్ద అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, అవసరమైతే బాలుడికి ఫిజియోథెరపీ చేయించాలని నేను, దర్శకుడు సుకుమార్ మాట్లాడుకున్నాం. ఇవన్నీ తెలుసుకోకుండా మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
నాకు ఆ విషయమే తెలియదు
థియేటర్ పరిసరాల్లో ఎలాంటి రోడ్‌షో నిర్వహించలేదని అల్లు అర్జున్ తెలిపారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయం తనకు మరుసటి రోజు వరకు తెలియదని చెప్పారు. తనపై కేసు నమోదు కావడం వల్ల నేరుగా వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవలేకపోయానని తెలిపారు. ‘థియేటర్ వాళ్లు పర్మిషన్ తీసుకున్నామని చెబితేనే నేను అక్కడకు వెళ్లాను. పోలీసులే అక్కడకు వచ్చిన జనాల్ని నియంత్రిస్తూ నా కారు లోపలికి వెళ్లేలా చూశారు. పోలీసులు అక్కడకు వచ్చారంటే పర్మిషన్ ఇచ్చినట్ట్లే కదా! అభిమానులు చుట్టుముట్టడంతో నా కారు ముందుకు కదల్లేదు. నేను అభివాదం చేస్తే రద్దీ క్లియర్ అవుతుందని పోలీసులు చెప్పడంతోనే చేయి ఊపుతూ ముందుకెళ్లాను’ అని అల్లు అర్జున్ చెప్పారు. సినిమా చూస్తున్నప్పుడు పోలీసు అధికారులెవ్వరూ తనను కలవలేదని, థియేటర్ యాజమాన్యం వచ్చి బయట రద్దీ పెరుగుతున్నదని చెబితే తాను బయటకు వచ్చానని తెలిపారు.
సంబురాలకు దూరంగా ఇంట్లో కూర్చున్నా
హీరోకు కాళ్లు చేతులు విరిగాయా అన్న సీఎం వ్యాఖ్యలపైనా అల్లు అర్జున్ పరోక్షంగా స్పందించారు. ‘కాళ్లు చేతులు విరిగినా ఏం పర్లేదు. అవన్నీ మామూలే. కానీ నేను మాట్లాడని మాటలను మాట్లాడినట్టు ప్రచారం చేస్తున్నారు. ఇరవై ఏండ్ల కెరీర్లో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించిన, మాట్లాడిన సందర్భాలున్నాయా? సినిమా పెద్ద విజయం సాధించింది. కానీ వేడుకలన్నీ రద్దు చేసుకుని 15 రోజులుగా ఇంట్లో కూర్చుని బాధపడుతున్నాను. ఘటన జరిగిన రోజు నుంచి నా మనసు స్థిమితంగా లేదు. నేను కూడా తండ్రినే. నాకూ ఓ కొడుకున్నాడు. బాధిత కుటుంబం బాధ ఎలా ఉంటుందో నాకు తెలియదా? అని అల్లు అర్జున్ అన్నారు. కేసు దర్యాప్తులో ఉన్నందున విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కుదరడం లేదని, త్వరలోనే అన్నింటికీ సమాధానం చెప్తానని స్పష్టంచేశారు.
మా కుటుంబం ఏమిటో మీకు తెలుసు: అల్లు అరవింద్
మూడు తరాలుగా తమ కుటుంబం సినిమారంగంలో ఉందని, ఎప్పుడైనా ఎవరితోనైనా అమర్యాదగా ప్రవర్తించామా అని అల్లు అర్జున్ తండ్రి, సినీనిర్మాత అల్లు అరవింద్ అన్నారు. థియేటర్ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ మా ఇంట్లోని పార్కులో ఓ మూలన కూర్చొని అదే ఆలోచనలో ఉన్నాడు. అభిమాని కుటుంబం ఇలా అయిపోయిందని బాధపడుతున్నాడు. సక్సెస్ సెలబ్రేషన్స్ చేద్దామన్నా వద్దని చెప్పాడు. మూడు తరాలుగా సినీ రంగంలో ఉన్న మా కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తుంటే బాధగా ఉంది. అందుకే ఈ రోజు మీ ముందుకొచ్చాం అని అల్లు అరవింద్ చెప్పారు.