మంగపేట/నందిపేట్/మాచారెడ్డి, సెప్టెంబర్ 9 : ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని పొదుమూరులో సోమవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి పలువురిని గాయపరిచింది. ఎర్రావుల సమ్మయ్య, కొప్పుల లాలయ్య, దాదాని, సైదా, మైతున్ బీ, ఘోరేతోపాటు మరో ముగ్గురిని కరించింది. వారికి తీవ్రంగా రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయించారు. పిచ్చికుక్క స్వైరవిహారంతో పలువురు భయాందోళనకు గురయ్యారు. అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేస్త్తున్నారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో కుక్కలు సోమవారం రెచ్చిపోయాయి. ఎక్కడికక్కడ దాడికి తెగబడ్డాయి. శునకాల దాడిలో పది మంది గాయపడ్డారు. బమ్మల లసుంబాయికి తీవ్ర గాయాలు కాగా.. ఆమెను జిల్లా దవాఖానకు తరలించినట్టు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్ తండా ఎక్స్‌రోడ్ పరిధిలోనూ ఓ కుక్క దాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు. గ్రామానికి చెందిన దాసరి మౌనిక, మ్యాడం అనసూయ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కుక్క వారిపై దాడి చేసి గాయపర్చింది.