హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : విద్యావేత్త ప్రొఫెసర్ మిర్యాల మురళీధర్‌కు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఆటాఎక్స్లెన్స్ అవార్డు దక్కింది. అమెరికాలోని ఆటా 18వ సదస్సులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన అందుకొన్నారు. హై టెంపరేచర్ సూపర్ కండక్టివిటీ సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు ఆయన అవార్డుకు ఎంపికయ్యారు. ఉస్మానియా పూర్వ విద్యార్థి మురళీధర్ జపాన్‌లోని షిబరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆచార్యుడిగా సేవలందిస్తున్నారు. ఎందరో తెలంగాణ, భారతీయ విద్యార్థులు జపాన్‌లో చదువుకొనేలా ఆయన ప్రోత్సహించడమే కాకుండా మార్గదర్శిగా నిలుస్తున్నారు.