సారపాక, ఏప్రిల్ 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి (28) గురువారం ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్సై జితేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహాలక్ష్మి సారపాకలో నివాసం ఉంటున్నారు. ఆమె ఇటీవల ఎంబీబీఎస్ పూర్తిచేసి ఉన్నత చదువులకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భద్రాచలం ఏరియా దవాఖానకు తరలించారు. మృతురాలి తండ్రి తాటి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు ఎస్సై జితేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహాలక్ష్మి మృతిపట్ల ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు సంతాపం తెలిపారు. తాటి వెంకటేశ్వర్లును పరామర్శించి ధైర్యం చెప్పారు.