హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సోమవారం నిర్వహించిన రాత పరీక్ష సజావుగా ముగిసింది. మొత్తం 833 పోస్టులకుగాను 55,189 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 162 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం పేపర్ -1 పరీక్షకు 55,189 మంది అభ్యర్థులు రాగా, మధ్యాహ్నం పేపర్ -2 పరీక్షకు 54,917 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-1, పేపర్-2 పరీక్షలు తప్పనిసరిగా రాయాలి. కానీ, పేపర్-1 రాసిన 272 మంది అభ్యర్థులు పేపర్-2 పరీక్ష రాయలేదు.
ఒక్క పరీక్ష మాత్రమే రాసిన ఈ 272 మందిని టీఎస్పీఎస్సీ అనర్హులుగా పరిగణిస్తున్నది. హైదరాబాద్లోని తన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ బీ జనార్దన్ రెడ్డి, సభ్యులు పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు.