హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): అక్రమంగా ఔషధాలు తయారు చేస్తూ, పెద్దఎత్తున నిల్వచేసిన ఆస్పెన్ బయోఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ గోదాంపై రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆబ్కారీ అధికారులతో కలిసి దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.96లక్షల విలువ చేసే ఔషధాలను సీజ్ చేశారు. డీసీఏ డైరెక్టర్ జనరల్ వీ బీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం…ఆస్పెన్ బయోఫార్మా కంపెనీకి చెందిన కే సతీశ్‌రెడ్డిపై గతంలోనే అక్రమ ఔషధాల తయారీ, అక్రమ నిల్వలు, లైసెన్స్ లేకుండా గోదాం నిర్వహణ వంటి కేసులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి గ్రామం, పోతారం వై-జంక్షన్లో అక్రమంగా ఔషధాలు తయారు చేస్తూ, పెద్దఎత్తున ఔషధాలను నిల్వ చేశాడనే సమాచారం మేరకు డీసీఏ అధికారులు స్థానిక ఆబ్కారీ అధికారులతో కలిసి ఔషధాల గోదాంపై మంగళవారం దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ.96లక్షల విలువ చేసే యాంటీ క్యాన్సర్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీడిప్రెసెంట్స్ తదితర ఔషధాలను సీజ్ చేశారు. 2023లో మచ్చబొల్లారంలో నకిలీ యాంటీ క్యాన్సర్ ఔషధాల తయారీలో, ఖమ్మం జిల్లా అన్నారుగూడెంలో ఔషధాల ముడిసరకు తయారీలో నూ కే సతీశ్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా గుర్తించినట్టు డీసీఏ అధికారులు వెల్లడించారు.
5 ఏండ్ల జైలు శిక్ష
డీసీఏ అనుమతి లేకుండా అక్రమంగా ఔషధాల తయారీ చట్టరీత్యా నేరం. నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుం ది. అనుమతి లేకుండా తయారు చేసే ఔషధాలు జీఎంపీ నిబంధనల ప్రకారం ఉండవు. ఇవి ప్రజల ప్రాణాలకు ప్రమాదం. సమాచారం ఉంటే డీసీఏ టోల్‌ఫ్రీ నెంబర్ 1800-599-6969 కు సమాచారం అందించండి. – డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి