వనస్థలిపురం, సెప్టెంబర్ 18 : అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. కానీ, రేవంత్‌రెడ్డి సర్కార్ కొలువుదీరి రెండేండ్లు కావస్తున్నా.. ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో వెంటనే నోటిఫికేషన్లు వి డుదల చేసి నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు పాలకూరి అశోక్‌కుమార్ నాలుగు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు బలవంతంగా అశోక్‌కుమార్‌ను వనస్థలిపురం ఏరియా దవాఖానకు తరలించారు. అశోక్‌కుమార్ దీక్ష విరమణకు ససేమిరా అన్నారు. వైద్యులకూ సహకరించడం లేదు. దవాఖానలోనూ దీక్ష కొనసాగిస్తున్నారు.
దవాఖానలో అశోక్‌కుమార్ మా ట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ంది. ఏండ్లుగా ఎదురుచూస్తున్నవారికి నిరాశే మిగిలింది. తక్షణమే 50 వేల ఉద్యోగాలకైనా నోటిఫికేషన్ విడుదల చేయాలి. అప్పటివరకూ దీక్ష విరమించేది లేదు’ అని స్పష్టంచేశారు.
అశోక్‌కుమార్‌ను దవాఖానకు తరలించారనే విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గురువారం దవాఖానకు వెళ్లి అశోక్‌కుమార్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.