వాషింగ్టన్\హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మరణించారు. (Four Indians Dies) మృతుల్లో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు. టెక్సాస్‌లోని అన్నాలో ఈ సంఘటన జరిగింది. బెంటన్‌విల్లేకు వెళ్లేందుకు శుక్రవారం కార్‌పూలింగ్ యాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకున్న నలుగురు భారతీయులు ఒకే క్యాబ్‌లో ప్రయాణించారు. ఒక లారీ వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక ముందున్న వారి ఎస్‌యూవీని ఢీకొట్టింది. ముందున్న వాహనాలను ఆ కారు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. నలుగురు భారతీయులు ఆ కారులో చిక్కుకుని కాలి మరణించారు. మృతదేహాలను గుర్తించలేనంతగా కాలిపోయారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కాగా, కార్‌పూలింగ్ యాప్ సమాచారం ద్వారా ప్రమాదంలో చనిపోయినవారిని అమెరికా పోలీసులు గుర్తించారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి, అతడి స్నేహితుడు ఫరూక్ షేక్, తెలంగాణకు చెందిన లోకేష్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్‌గా గుర్తించారు.
బెంటన్విల్లేలో నివసిస్తున్న ఆర్యన్, స్నేహితుడు ఫరూక్ షేక్‌తో కలిసి డల్లాస్‌లోని బంధువు ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదంలో వారిద్దరూ మరణించాడు. ఆర్యన్ తండ్రి సుభాష్ చంద్రారెడ్డికి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మ్యాక్స్ అగ్రి జెనెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఉంది. రాయచోటికి చెందిన ఈ కుటుంబం హైదరాబాద్‌లోని నిజాంపేటలో స్థిరపడింది.
మరోవైపు భార్యను కలిసేందుకు బెంటన్‌విల్లేకు వెళ్తున్న లోకేష్ ఈ ప్రమాదంలో చనిపోయాడు. అలాగే ఆర్లింగ్టన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ గ్రాడ్యుయేట్ అయిన తమిళనాడుకు చెందిన దర్శిని తన బంధువును కలిసేందుకు బెంటన్‌విల్లేకు వెళ్తూ ఈ ప్రమాదంలో మరణించింది. వీరి మరణ వార్త తెలియడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. తమ వారి మృతదేహాలను భారత్‌కు రప్పించేందుకు చొరవ చూపాలని బాధిత కుటుంబాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.