పాల్వంచ, జూన్ 27 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఐదో దశ కర్మాగారంలో శుక్రవారం హైడ్రోజన్ సిలిండర్ పేలి ఆర్టిజన్ ముద్దపోయిన సుబ్బారావు(46) మృతిచెందారు. పాల్వంచలోని ప్రశాంత్కాలనీలో నివసించే సుబ్బారావు కేటీపీఎస్ ఐదో దశ తొమ్మిదో యూనిట్లో ఆర్టిజన్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 9వ యూనిట్లో టర్బైన్ వద్ద హైడ్రోజన్ సిలిండర్ క్యాప్ బిగిస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయి సుబ్బారావుకు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఇంజినీర్లు, అధికారులు వెంటనే కొత్తగూడెంలోని సింగరేణి దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి ఇద్దరు కూతుళ్ల, కుమారుడు ఉన్నారు. కేటీపీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.