ఇందూరు, సెప్టెంబర్ 30: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువతిపై సామూహిక లైంగిక దాడి ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో సీపీ వెల్లడించిన వివరాల మేరకు.. ఈ నెల 28న ఆర్మూర్ ప్రాంతానికి చెంది న విద్యార్థిని (18) తన స్నేహితుడైన నవీన్‌కుమార్‌ను కలవడానికి నిజామాబాద్ వచ్చింది. నవీన్ తన స్నేహితులకు ఫోన్ చేయడంతో మరో ఇద్దరు తోడయ్యారు. అంతా కలిసి భోజనం చేయడానికి అంకాపూర్ వెళ్లారు. ఈ క్రమంలోనే యువతికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించారు. అనంతరం అందరు కలిసి నిజామాబాద్‌లోని బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నారు. మత్తులో ఉన్న యువతిని లోబర్చుకోవాలని పథకం పన్నారు. బస్టాండ్ ప్రాంతంలో మరమ్మతుల కోసం మూసివేసిన దవాఖానలో నవీన్ స్నేహితుడైన కరీం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మూసివేసిన దవాఖానకు యువతిని తీసుకురావాలని చెప్పడంతో అంతా కలిసి అక్కడికి చేరుకున్నారు.
కరీం సైతం స్నేహితులకు ఫోన్ చేయడంతో మరో ముగ్గురు అక్కడికి వచ్చారు. మొదట నవీన్ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తర్వాత ఆమెకు బలవంతంగా మద్యం తాగించి మరో ఇద్దరు లైంగికంగా దాడి చేశారు. అర్ధరాత్రి వేళ దవాఖాన ఎదుట ఆరుగురి కదలికలపై సమీపంలోని ఓ షాపింగ్‌మాల్ సెక్యూరిటీ గార్డుకు అనుమానం రావడంతో.. డయల్ 100కు సమాచారం అందించాడు. దీంతో వన్‌టౌన్ ఎస్సై సిబ్బందితో అక్కడికి చేరుకొని యువతిని దవాఖానకు తరలించారు. తనపై ముగ్గురు లైంగిక దాడికి పాల్పడ్డారని యువ తి తెలిపింది. యువతి ఇచ్చిన సమాచారం మేరకు ఆ ముగ్గురితోపాటు వారికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. 24 గంటల్లోనే కేసు ఛేదించడంతో అడిషనల్ డీసీపీ ఉషావిశ్వనాథ్, ఏసీపీ వెంకటేశ్వర్లును సీపీ అభినందించారు.
యువతికి అండగా ఉంటాం: ఎమ్మెల్సీ కవిత
ఖలీల్‌వాడి: నిజామాబాద్‌లో యువతిపై లైంగిక దాడి జరగడం బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏ మాత్రం ఉపేక్షించదని స్పష్టం చేశారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసిన పోలీసులకు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో షీ టీములు ఏర్పాటు చేసి ఆడబిడ్డలకు భరోసానిస్తున్నారని గుర్తుచేశారు. మహిళలపై వివక్ష చూపినా, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధిత యువతికి ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా అన్ని రకాలుగా అండగా నిలుస్తామని భరోసానిచ్చారు.