హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడంపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తు న్న ఎమ్మార్పీఎస్ నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోగా.. హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించేందుకు పార్శీ గుట్టలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయం నుంచి బయల్దేరిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరు తప్పించుకొని ఇందిరాపార్క్ వద్దకు చేరుకోగా.. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతోపాటు ముఖ్యనేతలను అరెస్టుచేసి గాంధీనగర్, బొల్లా రం, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిపై మందకృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మాదిగల కు అన్యాయం చేసిందని, వర్గీకరణ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్ర హం వ్యక్తంచేశారు. అన్ని రాష్ర్టాల కంటే ముం దుగానే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, తాజాగా చేపట్టిన టీచర్ ఉద్యోగాల భర్తీలో వర్గీకరణకు తిలోదకాలిచ్చారని అన్నారు. దీంతో మాదిగ సామాజికవర్గానికి చెందిన 600కు పైగా నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని మందకృష్ణ మండిపడ్డారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కర్ణాటక మాల సామాజిక వర్గానికి చెందిన వారనీ, అందుకే ఆ పార్టీ మాదిగ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానశాఖల మంత్రులు కూడా మాల సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటంతో ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండానియామకాలు భర్తీ చేశారని ఆరోపించారు.
శాంతియుతం గా చేపట్టిన ర్యాలీ ని అడ్డుకున్న రేవంత్ సర్కార్‌కు తగిన మూల్యం చెల్లించేలా ఎమ్మార్పీఎస్ సిద్ధంగా ఉన్నదని మందకృష్ణ స్ప ష్టంచేశారు. ఎస్సీ వర్గీకరణ అనుసరించే నియామకాలు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఈనెల 15న రాష్ట్రకార్యవర్గ సమావేశం నిర్వహించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.