సుబేదారి, సెప్టెంబర్ 2 : ఆన్లైన్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని ప్రజలను నమ్మించి దేశవ్యాప్తంగా రూ.కోట్లు కొల్లగొట్టిన ఇద్దరు సైబర్ నేరస్థులను వరంగల్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోమవారం వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో సీపీ అంబర్కిశోర్ ఝా కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం కాంచిపురానికి చెందిన జసిల్, ప్రీతి కలిసి గోల్డ్‌మ్యాన్ సచ్, యాం-బ్రాండింగ్స్ నకిలీ వెబ్సైట్ ద్వారా తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందని ప్రజలను నమ్మించి రూ.కోట్లు వసూలు చేశారు.
తెలంగాణలోనే 15 నేరాల్లో 3 కోట్లు కొల్లగొట్టారు. హనుమకొండకు చెందిన ఓ వ్యక్తి రూ.28 లక్షలు ఇన్వెస్ట్ చేసి మోసపోయినట్టు గుర్తించి వెంటనే వరంగల్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి చెన్నైలోని సలయూరులో జసిల్, ప్రీతి జంటను అదుపులోకి తీసుకున్నారు. ఈ జంట మొత్తం 150 కేసుల్లో కోట్ల వసూళ్లకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలినట్టు సీపీ తెలిపారు. నిందితులు వినియోగించిన బ్యాంకు ఖాతాలు సీజ్ చేసి, చెక్ బుక్కులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.