హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ నామమాత్రంగా మారిపోయిందని, కాంగ్రెస్ పాలనలో నిరుపయోగంగా మారిందని గౌడ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అవుతున్నా సంస్థకు చైర్మన్‌ను కూడా నియమించలేదని మండిపడుతున్నారు. నీరాకేఫ్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం నుంచి ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్మికులకు పరిహారం అందించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో దాదాపు 200 మంది గీతకార్మికులు ప్రమాదవశాత్తు చనిపోయారని, వారి కుటుంబాలకు పరిహారం కింద రూ.10 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని చెప్తున్నారు.
తెలంగాణలో గౌడన్నల ఆత్మగౌరవం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా నెక్లెస్‌రోడ్‌లో ‘నీరాకేఫ్’ను నిర్మించింది. నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలోని గౌడన్నల నుంచి అత్యాధునిక పద్ధతుల్లో నీరాను సేకరిస్తూ కేఫ్ ద్వారా విక్రయం జరుగుతున్నది. తాజాగా నీరాకేఫ్ నిర్వహణను కొందరు అనుచరులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని గౌడ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కేఫ్ నిర్వహణ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గీత కార్పొరేషన్ ద్వారానే కేఫ్‌ను నిర్వహించాలని కోరుతున్నారు.
తెలంగాణలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో తాటి, ఈత చెట్లు ఉన్నాయని, వాటి ద్వారా ప్రజలు స్వచ్ఛమైన కల్లు సేవిస్తున్నారని గౌడ సంఘాల నేతలు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు జిల్లా కేంద్రాల్లో నీరాకేఫ్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే లాభాలను గీత కార్మికుల సంక్షేమం, ప్రమాదవశాత్తు చనిపోయిన గౌడన్నల కుటుంబాలను ఆదుకోవడం కోసం వినియోగించాలని కోరుతున్నారు.
నీరాకేఫ్ నడపం చేతగాకపోతే నీరా అభివృద్ధికి ప్రభుత్వ పెద్దలు ఏం కృషి చేస్తారు? లక్షలాది మంది కల్లుగీత కార్మికులకు ఎలా ఉపయోగపడతారు? నేను కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడే నీరాకేఫ్‌ను అన్ని జిల్ల్లాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు జరిగాయి. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.30 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ పనులు ఆగాయి. ప్రస్తుత నీరాకేఫ్‌ను కార్పొరేషన్ ద్వారానే కేఫ్‌ను నిర్వహించాలి. కల్లుగీత కార్మికులను ఆదుకోవాలి.
– పల్లె రవికుమార్ గౌడ్, గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ మాజీ చైర్మన్