Outsourcing Employeesహైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : ‘తమ ఒప్పంద సేవలను కొనసాగిస్తూ ఇప్పటివరకు ఉత్తర్వులు రాలేదు. అయినా రెండు నెలలుగా పని చేస్తున్నాం. మాకు జీతం వస్తుందా? లేదా? అని వైద్యశాఖలోని టీవీవీపీ పరిధిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన ఇది. టీవీవీపీ(తెలంగాణ వైద్య విధాన పరిషత్)పరిధిలో దాదాపు 6 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈసీజీ, ఎక్స్‌రే టెక్నీషియన్లు, డ్రైవర్లు, ఎంఎన్‌వో, ఎఫ్ఎన్వో, బార్బర్లు.. ఇలా పలు విభాగాల్లో వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఏటా మార్చి నుంచి మార్చి వరకు వీరి ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం వీరి ఒప్పందాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేదు. గతంలో ఈ విషయాన్ని వైద్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికల వేళ సాధ్యం కాదంటూ.. పాత ఒప్పందాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. జూన్‌తో ఇది కూడా ముగిసింది. దీంతో రెండు నెలలుగా ఉద్యోగులు ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే విధుల్లో కొనసాగుతున్నారు. రెండు నెలలుగా వీరికి వేతనాలు కూడా అందలేదు. ఎలాంటి ఉత్తర్వులు లేకున్నా పనిచేస్తున్నామని, ఈ రెండు నెలల జీతం ఇస్తరో లేదోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 16 ఏండ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా కొనసాగుతున్నాం. ఈ సంవత్సరం ఇంకా ఆర్డర్ రాకపోవడంతో అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. తమకు రావాల్సిన రెండు నెలల పెండింగ్ వేతనం ఇవ్వాలి.