హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ అణువిద్యుత్తు కేంద్రానికి ఎన్డీఏ ప్రభుత్వం మంగళం పాడినట్టే కనిపిస్తున్నది. 2009లో యూపీఏ హయాంలో మొదలైన ఈ ప్రాజెక్టుకు 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 10 అణువిద్యుత్తు కేంద్రాలకు రూ.2.38 లక్షల కోట్ల రూపాయలను మంజూరు చేయగా, 2009లోనే కొవ్వాడకు మంజూరైన అణువిద్యుత్తు ప్లాంట్‌పై ఎన్డీఏ ప్రభుత్వం శీతకన్ను వేసింది. గత ఎనిమిదేండ్ల నుంచి ప్రాజెక్ట్ అంచనాలకు అనుమతులు తెలుపకపోగా, నిధుల కేటాయింపుల్లోనూ తీవ్ర జాప్యం చేస్తున్నది.
యూపీఏ హయాంలోనే
అక్టోబరు 2009లో నాటి యూపీఏ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో అణు విద్యుత్తు కేంద్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు యూనిట్ల నిర్మాణానికి రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అణువిద్యుత్తు కేంద్రం కోసం 2,079.66 ఎకరాల భూసేకరణ చేయగా, దానికి ఎన్పీసీఐఎల్కు మ్యూటేషన్ చేశారు. నాటి నుంచి నేటి వరకూ ప్రాజెక్టు(ప్రపోజల్)అంచనాలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, అణు మంత్రిత్వశాఖ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖరారు చేయలేదు. సీనియర్ జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ ఆర్టీఐ ద్వారా ఎన్పీసీఐఎల్ను సంప్రదించడంతో ఈ విషయాలు వెలుగు చూశాయి.
ఆరు రాష్ర్టాల్లో 10 కేంద్రాలకు నిధులు
తమిళనాడులోని కుడంకుళంలో 2000 మెగావాట్ల సామర్థ్యంగల అణువిద్యుత్తు ప్లాంట్‌ను 2002లో ప్రారంభించగా రూ.21,618 కోట్ల వ్యయంతో బీజేపీ ప్రభుత్వం దానిని పూర్తి చేసి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నది. అంతేకాకుండా 2014 నుంచి ఇప్పటి వరకు 12,400 మెగావాట్ల సామర్థ్యం తో ఆరు రాష్ట్రాలలోని ఎనిమిది ప్రాంతాల్లో పది అణు విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం రూ.2,38,843 కోట్ల అంచనాలను వేగంగా ఆమోదించింది.