హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం సెప్టెంబర్ 1నుంచి ఫాల్సీజన్ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాలమాయాదేవి శుక్రవారం ప్రకటనలో వెల్లడించారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
250 మంది బీసీ, 100 మంది ఈబీసీ మొత్తంగా ఈ విడతలో 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. 35ఏండ్లకు మించని, గ్రాడ్యుయేషన్లో కనీసం 60% మారులు సాధించడంతోపాటు, జీఆర్ఈ 260, జీమాట్ 500 స్కోర్, టోఫెల్ 60మార్కులు, ఐలెట్స్ 6.0 స్కోర్ కలిగిన అభ్యర్థులు అర్హులని వెల్లడించారు. వివరాలకు http://www. telanganaepass.cgg.gov.in వెబ్సైట్ సందర్శించాలని సూచించారు.