Cheyutha Pension | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ‘అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండు వేల పింఛన్‌ను నాలుగు వేలు చేస్తాం. దివ్యాంగుల పింఛను ఆరు వేలు చేస్తాం..’ అంటూ ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఏడాది దాటినా పింఛన్ల పెంపు ఊసెత్తడం లేదు. కనీసం కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదు. నిరుడు నిర్వహించిన ప్రజాపాలనలో, తాజాగా గ్రామసభల్లో దరఖాస్తులు సమర్పించిన సుమారు 25 లక్షల మంది ‘ఆసరా’ కోసం కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. అధికారులు, ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కనిపించిన నాయకుల కాళ్లావేళ్లా పడుతూ వేడుకుంటున్నారు. అయినా ప్రభుత్వం కనికరించడం లేదు.
13 నెలలుగా పాత పింఛన్లే
పింఛన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టి 13 నెలలైనా పట్టించుకోవడం లేదు. కేసీఆర్ సర్కారు ఇచ్చిన పాత పద్ధతిలోనే ఇప్పుడూ పింఛన్లు ఇస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 43,72,784 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వృద్ధులతో పాటు ఇతర వర్గాలకు నెలనెలా రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున పింఛన్లు ఇస్తున్నారు. ఇప్పటి వరకు పింఛను పెంపు దిశగా సర్కారు అడుగు వేయలేదు. కనీసం సమీక్షా కూడా నిర్వహించలేదు.
60 వేల మంది తొలగింపు
కొత్త పింఛన్లు ఇవ్వకపోగా.. వివిధ కారణాలు చూపుతూ లబ్ధిదారుల్లో కోత పెడుతున్నది. ఒకటికి మించి పింఛన్లు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ గతేడాది జూలై 13న 1,826 మందికి రికవరీ నోటీసులు జారీచేసింది. వీరితో పాటు వలసపోయిన, మరణించిన సుమారు 60 వేల మంది పింఛన్లను తొలగించింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 43.12 లక్షలకు పడిపోయింది. దీంతో ప్రతినెలా సర్కారుపై సుమారు రూ.144 కోట్ల భారం తగ్గింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు 20 లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో మరో 5 లక్షల మంది కొత్తగా అర్జీలు సమర్పించారు. మొత్తంగా 25 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
లబ్ధిదారులకు రూ.30 వేల బాకీ
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ప్రతినెలా రూ.4 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన సుమారు నెలకు రూ.900 కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉన్నది. 13 నెలలకు గానూ రూ.11,070 కోట్లు బాకీ పడింది. గతేడాది జనవరి, ఆగస్టు నెలల పింఛన్లను ఎగ్గొట్టింది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారుడికి రూ.30 వేల చొప్పున మొత్తంగా సుమారు రూ.13,000 కోట్లకు పైగా బాకీ ఉన్నది.
కేసీఆర్ పాలనలో ఠంచన్‌గా
నిస్సహాయులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 2014 నవంబర్‌లో ఆసరా పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడత నెలకు రూ.వెయ్యి చొప్పున అందజేసింది. 2015 మార్చిలో బీడీ కార్మికులు, 2017 ఏప్రిల్‌లో ఒంటరి మహిళలు, 2018 ఏప్రిల్‌లో ఫైలేరియా బాధితులు, 2022 ఆగస్టు నుంచి డయాలసిస్ పేషెంట్లను, 2023 జూలైలో టేకేదార్లను ఈ స్కీంలో చేర్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్లను రూ.2016కు పెంచింది. పదేండ్లలో నిరాటంకంగా ఆర్థిక చేయూతనందించింది. కరోనా కష్టకాలంలోనూ నిలిపివేయకుండా భరోసానిచ్చి ఆసరా లబ్ధిదారుల కడుపు నింపింది.
73 ఏండ్లున్నా పింఛన్ రావట్లేదు
మాది ఓదెల మండలం కొలనూర్. నా పేరు ఎండీ అక్తర్ బేగం. నాకు 73 ఏండ్లు. రెండు నెలల కిందట కాలు విరిగింది. ఆపరేషన్ చేయించుకుని మంచం పట్టిన. పింఛన్ కోసం పోయినేడు దరఖాస్తు పెట్టుకున్న. మండలాఫీసుకుపోయి సార్లను చాలాసార్లు కలిసిన. అయినా మంజూరు కాలేదు. మొన్న కూడా దరఖాస్తు పెట్టిన. ఈ సర్కారుకు దండం పెట్టి చెబుతున్న పింఛన్ ఇయ్యాలె.
-అక్తర్ బేగం, వృద్ధ్దురాలు, కొలనూర్, ఓదెల, మండలం, పెద్దపల్లి
నా భర్త చనిపోయినా ఇస్తలే
మాది ఓదెల మండలం కొలనూర్. నా భర్త మొగిలి చనిపోయిండు. గుంట భూమి లేని నిరుపేదలం. నాకు ఇద్దరు కొడుకులు. పాణం బాగా లేక నేను ఇంట్లోనే ఉంటున్నా. కలోగంజో తాగుతూ బతుకీడుస్తున్నం. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకున్న. కానీ, పింఛన్ ఇత్తలేరు. మా కుటుంబ పరిస్థితి కష్టంగా ఉంది. పింఛన్ ఇయ్యాలని సీఎం రేవంత్‌రెడ్డికి దండం పెట్టి కోరుతున్న. అట్లయితేనే మా బతుకు ఎళ్తది.
– లతమ్మ, వితంతువు, కొలనూర్, ఓదెల మండలం, పెద్దపల్లి