హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫీజు మినహాయింపు ఏదీ..? అంటూ అభ్యర్థులు సర్కారును ప్రశ్నిస్తున్నారు. గత టెట్‌కు ఫీజు మినహాయింపు ఇచ్చిన సర్కారు ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని నిలదీస్తున్నారు. 2024 నవంబర్‌లో నిర్వహించిన టెట్‌కు మార్చిలో ఫీజులు చెల్లించిన వారికి మినహాయింపు ఇచ్చారు. గతంలో టెట్ రాయని 20వేల మంది నుంచి ఫీజు వసూలుచేశారు. ఇప్పుడు ఎవ్వరికీ ఫీజు మినహాయింపు ఇవ్వలేదు. ఒక టెట్‌కు మినహాయింపు ఇచ్చి, మిగతా టెట్‌కు ఇవ్వకపోవడాన్ని నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. పెంచిన ఫీజులను తగ్గించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. టెట్‌కు ఈ నెల 15నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్ పరీక్షలను జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో నిర్వహిస్తారు.