హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఆర్మూర్ పసుపునకు భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసినట్టు తెలంగాణ హార్టికల్చరల్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పిడిగెం సైదయ్య తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రత్యేక బృందం ఆర్మూర్‌లో పర్యటించి పసుపు పంటను సందర్శించింది. ఈ సందర్భంగా సైదయ్య మాట్లాడుతూ.. చెన్నైలో ఆర్మూర్ పసుపు జీఐ రిజిస్ట్రీకి దరఖాస్తు చేయ గా.. శుక్రవారం సాంకేతికంగా రిజిస్ట్రీకి ఆమోదించినట్టు వెల్లడించారు. ఆవిర్భావ మూలం, రకాల లక్షణాలు, జీవ రసాయన ప్రొఫైలింగ్, రైతుల పద్ధతులు, డీఎన్ఏ ట్యాగింగ్ ఆర్మూర్ పసుపు రకం ప్రత్యేకత అని ఆయన చెప్పారు. యూపీ వారణాసిలో హ్యూమన్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న పద్మశ్రీ డాక్టర్ రజనీకాంత్, రైతుల తరఫున జీఐ టెక్నికల్ ఫెసిలిటేటర్‌గా వ్యవహరించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ వర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి మాట్లాడుతూ.. భౌగోళిక సూచిక(జీఐ) రిజిస్ట్రేషన్ ఆర్మూర్ పసుపును పండించే రైతులకు గేమ్‌చేంజర్ కానున్నట్టు తెలిపారు. ప్రీమియం ధర, మార్కెట్, ఎగుమతి సామర్థ్యం వంటి ఆర్థిక, మార్కెట్ ప్రయోజనాలు జీఐ ట్యాగ్‌తో ముడిపడి ఉన్నట్టు స్పష్టంచేశారు. రాష్ట్రంలో మరో 15 పంటలను పరిశీలించిన తర్వాత.. వాటికి జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేస్తామని వెల్లడించారు. జీఐ ట్యాగ్‌తో అంతర్జాతీయ గుర్తింపు, ఎగుమతి అవకాశాలు పెరుగుతాయని అందుకే ఈ ప్రాజెక్టుకు ఆర్థికంగా మద్దతు ఇచ్చినట్టు నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ కే ఉదయభాస్కర్ వెల్లడించారు.
7వ రోజుకు చేరిన అశోక్ దీక్ష
వనస్థలిపురం, సెప్టెంబర్ 20 : అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. దీంతో తెలంగాణ నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు పాలకూరి అశోక్‌కుమార్.. రేవంత్‌రెడ్డి సర్కార్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేపట్టాడు. ఈ దీక్ష శనివారం ఏడోరోజుకు చేరింది. చైతన్యపురిలోని తన నివాసంలో చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకొని అశోక్‌కుమార్‌ను వనస్థలిపురం ఏరియా దవాఖనకు తరలించారు. అయినప్పటికీ ఏ మాత్రం నెరవకుండా అశోక్ దవాఖానలో దీక్షను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి తక్షణమే 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు దీక్ష విరమించేది లేదని తేల్చిచెప్పారు.