హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : టీచర్ల బదిలీల దరఖాస్తుల గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు సోమవారం ముగియగా, తాజాగా ఫిబ్రవరి 1 వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి వరకు బదిలీలు కోరుతూ 56,977 దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు.
11 మంది పరిశీలకులు
సజావుగా ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు 11 మంది పరిశీలకులను పాఠశాల విద్యాశాఖ నియమించింది. ఎం రాధారెడ్డి (రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి, వికారాబాద్), కృష్ణారావు (హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి), సీహెచ్ రమణకుమార్ (నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం), జీ ఉషారాణి (నిజామాబాద్, కామారెడ్డి), ఎస్ విజయలక్ష్మీబాయి (వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాం), ఎస్ శ్రీనివాసచారి (ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం), పీ రాజీవ్ (జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల), ఎం సోమిరెడ్డి (రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్), పీ మదన్మోహన్ (ములుగు, భూపాలపల్లి), బీ వెంకటనర్సమ్మ (మహబూబ్‌నగర్, నారాయణపేట), ఏ ఉషారాణి (నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ)లను పర్యవేక్షణాధికారులుగా నియమించారు.