హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు ఆధునిక సాంకేతికత సాయంతో ఇక్రిశాట్ ఎప్పటికప్పుడు పరిష్కారాలను చూపుతున్నది. అందులో భాగంగా భూసారంతోపాటు పంటలకు సోకే తెగుళ్లు, క్రిమికీటకాలను గుర్తించి, రైతులకు సత్వర పరిష్కారాలను అందించేందుకు ప్లాంటిక్స్తో కలిసి ఓ మొబైల్ యాప్ను తయారు చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఈ యాప్ రైతులకు గొప్ప వరంగా మారింది. దీన్ని ఉపయోగించి పంటను ఫొటో తీయగానే దానికి సోకిన చీడను విశ్లేషించి, నియంత్రణకు శాస్త్రీయ సూచనలను అందిస్తున్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది ఈ యాప్ను ఉపయోగిస్తున్నారని, గత పదేండ్లలో ఈ యాప్ 10 కోట్లకుపైగా ఫొటోలను విశ్లేషించి వ్యవసాయ సమస్యలకు పరిష్కారాలను అందించిందని ఇక్రిశాట్ వెల్లడించింది. ఇటీవల ఈ యాప్ వినియోగం మరింత పెరగడంతో రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే కరదీపికలా తీర్చిదిద్దారు. పంటలకు సంబంధించిన 700 రకాల వ్యాధులను విశ్లేషించగలిగే ఈ యాప్ ప్రస్తుతానికి 20 భాషల్లో సేవలు అందిస్తున్నట్టు ఇక్రిశాట్ తెలిపింది.