పాలకుర్తి/దేవరుప్పుల, జూలై 7: జీతం రాకపోవడంతోపాటు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ఉపాధి హామీ ఏపీవో మృతి చెందాడు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కమ్మగాని శ్రీనివాస్ (48) దేవరుప్పుల మండలంలో ఉపాధి హామీ ఏపీవోగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం శ్రీనివాస్ మార్నింగ్ వాక్కు వెళ్లగా, దేవరుప్పులలోని జనగామ రోడ్డులో గల ఓ మోటర్ వెహికిల్ షోరూం వద్ద గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పని ఒత్తిడితోపాటు మూడు నెలలుగా జీతం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఏపీవో మృతి చెందాడని ఆరోపిస్తూ ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది నిరసన తెలిపారు. ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్రావు తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్రావు మాట్లాడుతూ ఉపాధి హామీ సిబ్బందిపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆరోపించారు.
శ్రీనివాస్ది ప్రభుత్వ హత్యే : ఎర్రబెల్లి
ఉపాధి హామీ ఏపీవో శ్రీనివాస్ది కాంగ్రెస్ సర్కారే హత్యేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఏపీవో మృతిపట్ల సంతాపం తెలిపిన ఎర్రబెల్లి ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. శ్రీనివాస్ కుటుంబ స భ్యులను ఓదార్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పథకంలో మూడు నెలలకుపైగా జీతాలు రాక ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘ టనలు జరుగుతున్నాయని ఆరోపించారు.