AP Vijaya Dairy | హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : ఏపీ విజయ డెయిరీ హైదరాబాద్‌లో అక్రమదందాకు తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, తెలంగాణలో పాల కొనుగోలు లేకుండానే ఇక్కడ వ్యాపారం చేస్తున్నది. ఇప్పటికే అడ్డదారిలో ఏపీ విజయ బ్రాండ్ పేరుతో పెరుగు తయారీ చేస్తూ విక్రయిస్తున్నారు. ఇందుకోసం చేవెళ్లలోని అంగడిచిత్తంపల్లి వద్ద భారీ ప్లాంట్ ఏర్పాటుచేశారు. అక్కడి నుంచే పెరుగు సరఫరా జరుగుతున్నది.
అయితే ఇక్కడ పెరుగు తయారీ, విక్రయాలకు అనుమతి లేకుండానే ఏపీ విజయ డెయిరీ దందా నడుపుతున్నట్టు సమాచారం. అయినప్పటికీ ఏపీ విజయ డెయిరీ అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు హైదరాబాద్‌లో మిల్క్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్‌కు సంబంధించి ఏపీ విజయ అధికారికంగా టెండర్లు పిలవడం చర్చనీయాంశమైంది. ఏపీ విజయ డెయిరీ తెలంగాణలో ఎక్కడ కూడా రైతుల నుంచి పాలు కొనుగోలు చేయడం లేదు. అయినప్పటికీ టెండర్లు పిలువడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.