హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నానక్‌రామ్‌గూడలోని ఓ ప్రాంతంలో కొందరు వ్యక్తులు డ్రగ్స్‌తో పార్టీ చేసుకుంటున్నారన్న సమాచారం మేరకు ఈగల్ టీమ్, నార్సింగి పోలీసులు శనివారం సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. దీంతో ఏపీలోని జమ్మలమడుగుకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి, ఆయన స్నేహితులు డ్రగ్స్ తీసుకుంటూ ఈగల్ టీమ్‌కు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించడంతో సుధీర్‌రెడ్డికి పాజిటివ్ వచ్చింది. మిగతా ఇద్దరికి నెగెటివ్ వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో సుధీర్‌రెడ్డిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించి, ఆయన కుటుంబసభ్యులకు సమాచారమిచ్చామని, సోదాల్లో డ్రగ్స్, గంజాయి దొరకలేదని ఈగల్ టీమ్ అధికారులు తెలిపారు. డిప్రెషన్ కారణంగానే సుధీర్‌రెడ్డి డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని, గతంలో కూడా ఆయన డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు సుధీర్‌రెడ్డిని, అతని స్నేహితులను విచారిస్తున్నారు. వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి? ఎవరు సరఫరా చేశారు? వారి వెనుక ఎవరున్నారు? అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ పార్టీలపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.