హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. వైఎస్సార్ గృహవసతి ఖర్చును మూలధన వ్యయం కింద తప్పుగా చూపించిందని 2020 మార్చితో ముగిసిన ఏడాదికి సంబంధించిన కాగ్ నివేదిక వెల్లడించింది. రూ. 1100 కోట్ల విపత్తు నిధులు మళ్లించినట్టు స్పష్టించి, రాష్ట్ర విపత్తు నిధికి కేంద్ర వాటా కింద రూ.324.15 కోట్లు ఇచ్చినట్టు వివరించింది. జాతీయ విపత్తు నిధి కింద రూ.570.91 కోట్లు ఇచ్చినట్టు పేర్కొంది. ఏపీ ప్రభుత్వం మొత్తం రూ.1100 కోట్ల విపత్తు నిధులను రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఖాతాకు మళ్లించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. విపత్తు సాయానికి ఖర్చు చేసినట్టుగా చూపించి ద్రవ్య వినిమయ చట్టం ఉల్లంఘనకు ఏపీ ప్రభుత్వం పాల్పడినట్టు తెలిపింది. బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో 377 నిబంధన కింద టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు లేవనెత్తిన అంశాలకు కేంద్ర ఆర్థిక శాఖ రాతపూర్వకంగా వివరణ ఇచ్చింది.