Nara Lokesh | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నమో జపం చేశారు. నరేంద్ర మోదీ దృష్టిలో పడేందుకు లోకేష్ పడరాని పాట్లు పడ్డాడు. నమో నమహా అని పదేపదే వ్యాఖ్యానించడమే కాకుండా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని తెలంగాణోళ్లు సంతోషపడితే.. తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని ఇదే ప్రధాని నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో, అనేక వేదికలపై మాట్లాడారు. లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఏపీలో మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని తెలంగాణవాసులు మరిచిపోలేదు.
మళ్లీ ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్లు, మోదీ దృష్టిలో పడేందుకు.. తెలంగాణ అస్తిత్వం, ఉద్యమం గురించి ఏ మాత్రం జ్ఞానం లేని నారా లోకేష్ నోరు పారేసుకున్నారు. రాష్ట్ర విభజనపై అవాకులు చెవాకులు పేల్చుతూ.. తెలంగాణపై మరోమారు విషం చిమ్మే ప్రయత్నం చేశారు నారా లోకేష్. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు.
అమరావతి నమో నమహా.. అమరావతి నమో నమహా.. అమరావతి నమో నమహా.. అంటూ తన ఉపన్యాసాన్ని నారా లోకేష్ ప్రారంభించారు. మోదీ సహకారం, అండతో అమరావతిలో రాజధాని పనులు ప్రారంభించుకుంటున్నాం. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మనల్ని బయటకు గెంటేశారు. ఎక్కడ్నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.