మంగళవారం 07 జూలై 2020
Telangana - Mar 17, 2020 , 10:11:47

ఏపీ విద్యుత్‌ ఉద్యోగులు గో బ్యాక్‌

ఏపీ విద్యుత్‌ ఉద్యోగులు గో బ్యాక్‌
  • నినదించిన తెలంగాణ ఉద్యోగులు
  • ధర్నాలతో దద్దరిల్లిన విద్యుత్‌సౌధ
  • 31 వరకు ఆందోళనలకు పిలుపు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఏపీ విద్యుత్‌ సంస్థల నుంచి రిలీవ్‌ అయిన ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణలో చేరేందుకు ప్రయత్నించడంపై స్థానిక విద్యుత్‌ ఉద్యోగులు భగ్గుమన్నారు. సుమారు 50 మంది రిలీవ్‌ ఆర్డర్లను తీసుకొని తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో చేరేందుకు రావడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున ఆందోళనకుదిగారు. దీంతో ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌధ, మింట్‌ కాంపౌండ్‌లోని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ కార్యాలయాల్లో ఉద్రిక్తత నెలకొంది. ధర్మాధికారి ఉత్తర్వులకు విరుద్ధంగా.. ఆప్షన్లు ఇవ్వని 584 మందిని ఏపీ సర్కార్‌ రిలీవ్‌చేసిన విషయం తెలిసిందే.

వారిలో కొంతమంది సోమవారం తెలంగాణ సంస్థల్లో చేరేందుకు వచ్చారు. దీంతోవారిని విద్యుత్‌ సంస్థల్లో అడుగుపెట్టనియ్యకుండా అడ్డుకున్న తెలంగాణ ఉద్యోగులు.. ‘ఆంధ్రా విద్యుత్‌ సంస్థలు డౌన్‌ డౌన్‌', ‘ఏపీ ఉద్యోగులు గోబ్యాక్‌' అంటూ నినాదాలు చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి, విద్యుత్‌సౌధ, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ కార్యాలయాల గేట్ల ముందు బైఠాయించారు. దీంతో కొందరు ఏపీ ఉద్యోగులు వెనుదిరిగిపోగా, మరికొంత మంది ఖైరతాబాద్‌ ఆస్కీ వైపు గుమిగూడటంతో పోలీసులు వారిని ఆదుపులోకి తీసుకొని గోషామహల్‌ స్టేడియానికి తరలించారు. ఈ నెల 31 వరకు తెలంగాణవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.

ఏ ఒక్కరినీ చేర్చుకోనివ్వం: టీఎస్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ

ఏ ఒక్క ఆంధ్రా ఉద్యోగిని విధుల్లో చేర్చుకోనివ్వబోమని టీఎస్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ నేతలు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్‌ అసొసియేషన్‌ (టీఈఈఏ) అధ్యక్షుడు ఎన్‌ శివాజీ, విద్యుత్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (వీఏవోఏటీ) ప్రధాన కార్యదర్శి పీ అంజయ్య స్పష్టంచేశారు. ఇది ఆంధ్రా దురహంకారానికి, పెత్తనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఏపీ విద్యుత్‌ సంస్థలు మొండివాదనలతో ఏకపక్షంగా ఉద్యోగులను రిలీవ్‌చేయడం సమంజసంకాదని అన్నారు.

తమ ఉద్యోగాలకు అడ్డొస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని, ఎవరైనా విధుల్లో చేరడానికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. జేఏసీ నేతలు రామేశ్వరయ్యశెట్టి, నాజర్‌షరీఫ్‌, వినోద్‌, గణేశ్‌, తుల్జారాంసింగ్‌, సురేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, తిరుపతయ్య, పరమేశ్‌, వీరస్వామి, రవి, అనిల్‌, తెలంగాణ పవర్‌ ఎంప్లాయిస్‌ జేఏసీ నేతలు పీ రత్నాకర్‌రావు, పీ సదానందం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


logo