‘75 స్టూడెంట్ శాటిలైట్ మిషన్’లో భాగస్వామ్యం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 ఘట్కేసర్ రూరల్: రంగారెడ్డి జిల్లా వెంకటాపూర్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయం మరో మైలురాయిని దాటింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్రం చేపట్టే ‘75 స్టూడెంట్ శాటిలైట్ మిషన్-2022’లో భాగస్వామ్యం కానున్నది. ఇందుకోసం అనురాగ్ వర్సిటీ ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐటీసీఏ)తో బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఐటీసీఏతో ఒప్పందం చేసుకున్న తెలంగాణ తొలి వర్సిటీగా అనురాగ్ నిలిచింది. వర్సిటీలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో ఐటీసీఏ అధ్యక్షుడు డాక్టర్ ఎల్వీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చిన్న ఉపగ్రహాలను రూపొందించటం, అభివృద్ధి చేయడం, నిర్మించడం, సమగ్రపరచడం, పరీక్షించటం, ప్రయోగించడం, పర్యవేక్షించడం వంటి సామర్థ్యాలను పెంపొందించడానికి వివిధ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులకు ఈ మిషన్‌లో అవకాశం లభించినట్టు తెలిపారు. ఇజ్రాయెల్, సెర్బియా, జపాన్‌కు చెందిన గ్లోబల్ స్పేస్ టెక్ సంస్థలు ఈ మిషన్‌లో పాల్గొంటున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఐటీసీఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే గోపాలకృష్ణన్, వ్యవస్థాపకుడు నిఖిల్ రియాజ్, చాన్స్‌లర్ డాక్టర్ యూబీ దేశాయ్, వైస్ చాన్స్‌లర్ ఎస్ రామచంద్రం, రిజిస్ట్రార్ సమీన్ ఫాతిమా, వర్సిటీ సీఈవో సూర్యదేవర నీలిమ, కళాశాల డీన్లు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.