మహదేవపూర్ (కాటారం), అక్టోబర్ 6: దిగుబడులు రాక, అప్పులు తీర్చలేక మరో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఆదివారం జరిగింది. ఎస్సై అభినవ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొండ రాజబాపు(45) పలిమెల గ్రామంలో భూమి కౌలు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. రెండేండ్లల్లో అధిక వర్షాల కారణంగా పంట నష్టం జరిగింది. సరైన దిగుబడి రాక రూ.7 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. దీంతో కాటారానికి వచ్చి మళ్లీ 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగుచేయగా, నష్టం రావడంతో రూ.3 లక్షల అప్పులయ్యాయి. అప్పులు తీర్చే మార్గం కానరాక తీవ్ర మనోవేదనతో రాజబాపు గురువారం రాత్రి గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మహదేవపూర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించా రు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.